నల్లగొండ, జూన్ 14 : కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాల్లో విశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
జాతి, వృత్తి, లింగ బేధం లేకుండా అందరూ ఈ అవార్డులకు అర్హులన్నారు. 2026 సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా స్వీకరించబడతాయని వెల్లడించారు. నామినేషన్లను 31జూలై, 2025 లోగా పైన పేర్కొన్న పోర్టల్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్లో, గరిష్టంగా 800 పదాలకు మించకుండా వివరణాత్మక కథనం రూపంలో పంపించాలని తెలిపారు.
ఆన్లైన్లో నామినేషన్లు పంపడానికి అవసరమైన సూచనలు https://awards.gov.in పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని, అలాగే నియమ నిబంధనలు పద్మ అవార్డుల వెబ్సైట్: https://padmaawards.gov.in లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో పైన పేర్కొన్న రంగాల్లో అత్యున్నత, విశిష్ట సేవలు అందించిన వారు దరఖాస్తు చేసుకోవాలని, ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, దివ్యాంగుల్లో ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.