యాదాద్రి భువనగిరి, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ‘బిడ్డా.. ఉన్న ఇల్లు మీకే రాసిచ్చిన. ఇప్పుడు ఉండడానికి ఇంత జాగ కూడా లేదు. ఏడ తినాలి? ఏడుండాలి..? రోడ్డుమీదే ఉంటున్న. అయ్యలార్లా.. బుక్కెడు బువ్వ పెట్టండి.. పట్టించుకోండయ్యా’ అంటూ ఓ అవ్వ వేడుకున్నంటున్నది. నడవలేని పరిస్థితిలో ఉన్న వీల్‌చైర్‌లో వచ్చిన ఆమెను ఓ వ్యక్తి చిన్నపిల్లలా కలెక్టరేట్ లోపలికి చేతుల్లో ఎత్తుకుని రాగా, ప్రజావాణిలో ఉన్నతాధికారుల ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేసింది.
యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామానికి చెందిన మిర్యాల లక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు. ఆమెకు ఓ ఇల్లు ఉండగా.. ముగ్గురు కొడుకులకు గిఫ్ట్ డీడ్ చేసింది. నెలకో కొడుకు దగ్గర ఉండేలా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. ఒక్కొక్కరు నెలకు వెయ్యి చొ ప్పున మూడు వేల రూపాయలు తల్లి ఖర్చులకు ఇ స్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉ న్నా ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ తల్లి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణికి వచ్చింది. తన బాగోగులు చూడని కొడుకుల నుంచి తన ఇంటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.