సూర్యాపేట టౌన్, డిసెంబర్ 27 : మొబైల్ ఫోన్స్ కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీకే ఫైల్స్ సందేశం పంపించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఏపీకే ఫైల్స్ అనుసరించేలా చేసి మొబైల్ హ్యాక్ చేసి సైబర్ మోసగాళ్లు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తారని తెలిపారు. ఏపీకె ఫైల్స్ అనేవి సైబర్ మోసగాళ్ల ఎత్తుగడ మాత్రమేనని ఏపీకే ఫైల్స్ అనుసరిస్తూ మొబైల్ యాప్ లు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మొబైల్ డాటా దొంగిలించి హ్యాక్ చేసి ఆర్థిక నష్టం కలిగిస్తారని తెలిపారు. మొబైల్స్ కు సందేశం రూపంలో వచ్చే ఏపీకే ఫైల్స్ ను ఎవరు డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఆర్టీఏ చలాన్, టీజీ పోలీస్ చలాన్, ప్రభుత్వ పథకాలు అంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసి వాటిని మొబైల్ ఫోన్స్ లో డౌన్లోడ్ చేసుకునేలా ప్రేరేపిస్తారన్నారు.
ఏపీకే ఫైల్స్ ను మొబైల్ లో డౌన్లోడ్ చేస్తే మొబైల్ పూర్తిగా సైబర్ మోసగాళ్ల ఆధీనంలోకి వెళ్తుందన్నారు. సైబర్ మోసగాళ్లు మీ మొబైల్ ను వినియోగించి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును దొంగలిస్తారన్నారు. ఇలాంటి ఏపీకే ఫైల్స్ ను ఎవరు నమ్మవద్దు అని సూచించారు. ఈ ఏపీకే ఫైల్స్ అనేవి సైబర్ మోసగాళ్ల సృష్టి అని తెలిపారు. ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఫోన్ డేటా దొంగిలించే ప్రమాదం ఉందని. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులు క్లిక్ చేయకూడదన్నారు. అధికారిక సమాచారం కోసం మాత్రమే ప్రభుత్వ వెబ్సైట్లు, అధికారిక యాప్‌లు ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలు అందిన వెంటనే వాటిని పోలీస్ శాఖకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ మోసగాళ్ల పన్నాగాలకు లోనుకావొద్దని, మీ భద్రత కోసం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.