రామగిరి, ఫిబ్రవరి 23 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. గత నెలలో ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 22తో ముగిశాయి. దీంతో మార్చి 5 నుంచి 20వరకు జరిగే వార్షిక పరీక్షలపై దృష్టి సారించింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్స్, ఇన్విజిలేటర్స్‌ను నియమించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా 2,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుండగా గంట ముందునుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులను అధ్యాపకులు ప్రిపేర్ చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు సైతం సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎండకాలం దృష్ట్యా తాగునీరు అందుబాటులో ఉంచనున్నారు. ఎవరైనా అస్వస్తతకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స అందించేలా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని నియమించనున్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులకు అందుబాటులో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్మీడియేట్ విద్యాశాఖ, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అంతా సిద్ధం చేశాం. సీఎస్, డిపార్టుమెంట్ అధికారులతో ఈ నెల 28న సమావేశం నిర్వహించి సూచనలు చేయనున్నాం. పరీక్షలో ఇబ్బందులు లేకుండా ఫ్లయింగ్ స్వాడ్స్తోపాటు జిల్లా పరీక్ష విభాగం అధికారులు పర్యవేక్షణ చేస్తారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఎండల దృష్ట్యా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచుతున్నాం.