సూర్యాపేట, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తోందని, అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ పార్టీ కేసీఆర్ ను చూసి భయపడుతుందని, అందుకే రేవంత్ రెడ్డితో చేతులు కలిపిందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌పై కాళేశ్వరం, ఈ కార్ రేస్ విషయంలో పెట్టిన కేసులన్నీ పనికిమాలిన కేసులేన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పొషిస్తున్నదని, ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైనా నేడు సైతం చాలా చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులు, కిడ్నాప్‌లు జరిగాయన్నారు. కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు. ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలాచోట్ల పొత్తులు పెట్టుకున్నయ్. బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నయని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీవేనని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. అది ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేశాం, సగానికి పైగా పంచాయతీలను గెల్చుకున్నట్లు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుమలగిరి మున్సిపాలిటీలో రూ.33 కోట్లు అభివృద్ధి నిధులు సాంక్షన్ చేపిస్తే వాటిని అన్నింటినీ ఆపి వేశారన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే సామేల్ తో నియోజకవర్గంలో దందాలు, దోపిడీలు, దాడులు ఎక్కువ అయినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడు ఎలాంటి దౌర్జన్యాన్ని చూడలేదన్నారు. దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తూన్నారన్నారు. అయినా తామెవరికీ భయపడమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం చేసినోళ్లం, ఈ కాంగ్రెస్ దొంగలకు భయపడే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో గెలిచి చూపిస్తామని, తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.