జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారడం, ప్రభుత్వం పట్టించుకోపోవడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చిన జనంతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. మండలాలు, పట్టణాలు, గ్రామాల్లోని సర్కారు దవాఖానల్లో సరైన వైద్య సదుపాయం లేక జనం ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లాల్సి వస్తున్నది.
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా టైపాయిడ్, డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. జిల్లాలో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ ఏరియా ఆస్పత్రులు, 21 పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు ఉన్నాయి. అన్ని చోటక్లూ జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచే తరలివస్తున్నారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాల సమస్యలతో బారులు దీరుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,257 మందికి జ్వరాలు వచ్చాయి. అత్యధికంగా తుర్కపల్లి మండలంలో 429 మంది ఉన్నారు. 81మందికి డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయ్యింది.
జిల్లా ఆస్పత్రిలో సదుపాయాల్లేవ్
భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనూ కనీస సదుపాయాలు కరువయ్యాయి. రోజూ 400 నుంచి 500 పైగా ఓపీ నమోదవుతున్నది. రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఆస్పత్రిలోని ల్యాబ్ వద్ద నమూనాలు తీసుకోవడానికే గంటల సమయం పడుతున్నది. పదుల సంఖ్యలో స్వయంగా రోగులే క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే రోగాలతో బాధపడుతున్న వారు రెండు, నుంచి మూడు గంటల లైన్లో నిలబడాల్సి వస్తున్నది. మందుల కొరత వేధిస్తున్నది. డాక్టర్లు కూడా ఎక్కువ సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మందులు కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో ఉండగా, వైద్యులు రాసిన చీటీల్లో సగం బయట కొనుగోలు చేయాల్సి వస్తున్నది. అజిత్రోమైసిన్, యాంటీబయాటిక్‌లు, సిరప్లు అందుబాటులో ఉండడం లేదు. దాదాపు అన్ని పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచే సరఫరా లేదని చెప్తుండడం గమనార్హం. ఇక జిల్లా కేంద్రాస్పత్రి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. ఆవరణలో అక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయింది. వార్డుల్లో ఈగలు, దోమలు కనిపిస్తున్నాయి. నోటీస్ బోర్డులపై ఎప్పటికప్పుడు రోగుల వివరాలు పొందుపరచడంలేదు.
ఫాగింగ్ మరిచారు
పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ అధ్వానంగా మారింది. పల్లెలను పట్టించుకునే వారే లేరు. స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. దాంతో పల్లెల్లో పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడింది. ఎక్కడ చూసినా రోడ్లపైనే మురుగు ప్రవహిస్తున్నది. చెత్తాచెదారం పేరుకుపోతున్నది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దోమలు, ఈగలు రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. పందులు, కుక్కలు విపరీతంగా సంచరిస్తున్నాయి. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయడమే మరిచిపోయారు.
సర్కారు దవాఖాన అంటేనే భయమైతున్నది
జ్వరం, కాళ్ల నొప్పులతో ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చాను. పరీక్షలు చేయించుకోవాలని డాక్టరు చీటీ రాశారు. శాంపిల్స్ ఇవ్వడానికే మూడు గంటలు పట్టింది. జ్వరం, కాళ్ల నొప్పులతో ఆరోగ్యం బాగా లేకున్నా గంటల తరబడి నిలబడ్డాను. నిలబడే ఓపిక లేక చాలా ఇబ్బంది అయ్యింది. ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటేనే భయమైతున్నది. ప్రైవేట్‌కు పోతే వేలకు వేలు గుంజుతున్నరు.
– కంసాని భాస్కర్, బొల్లేపల్లి, భువనగిరి మండలం
బొల్లేపల్లి పీహెచ్సీలో మందుల కొరత
భువనగిరి కలెక్టరేట్ : బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మందులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 10 సబ్‌సెంటర్లు ఉండగా అందులో రాయగిరి, అనంతారం, అనాజీపూర్, నందనం, ముత్తిరెడ్డిగూడెం, చందుపట్ల, బస్వాపూర్, వీరవెల్లి, వడపర్తి, బొల్లేపల్లి ఉన్నాయి. నందనం, వీరవెల్లి సబ్ సెంటర్లలో ఏఎన్ఎంల పోస్టులు ఖాళీగా ఉండగా మందుల కొరత సైతం వేధిస్తున్నది.
మందులు లేవంటున్నారు
పీహెచ్సీ దవాఖానకు పొద్దుగాలనే వచ్చిన. నాకు కాళ్ల నొప్పులతోపాటు అనారోగ్యంగా ఉన్నది. ఆసుపత్రిలో మందులు లేవంటున్నారు. సూదిమందు సైతం లేదు. తండా నుంచి వచ్చి మరిపోవుడైతున్నది. డాక్టర్ కూడా లేడు. సర్కారు దవాఖానలో మందులు, డాక్టర్లు లేకపోతే రోగుల పరిస్థితి ఎలా ఉంటుంది.
– ధరావత్ బాషా, మీటితండా, భువనగిరి మండలం
ఇండెంట్ పెట్టాం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత కొంత మేర ఉంది. దీని కోసం ఇండెంట్ సైతం పెట్టాం. త్వలరో మందులు వస్తాయి. ప్రతి సబ్సెంటర్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 60నుంచి 100మందికి పైగా ఓపీ నమోదవుతాయి. 20 నుంచి 25వరకు వైద్య పరీక్షలు చేపడుతాం.
-డాక్టర్ యామినీశృతి, వైద్యాధికారిణి, బొల్లేపల్లి పీహెచ్సీ