24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రికార్డు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయితో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నది. స్వయంగా ఆ శాఖ ఉన్నగుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాకు మరింత ప్రాధాన్యం దక్కుతున్నది. తాజాగా సూర్యాపేటకు సమీకృత విద్యుత్ సర్కిల్ కార్యాలయం మంజూరైంది. ఈ మేరకు టీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మిగడ్డలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో 7 కోట్లా 15 లక్షల రూపాయలతో నిర్మించనున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ నెల 30న శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సర్కిల్ ఇంజినీర్ కార్యాలయం, డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంతో పాటు సబ్ డివిజనల్ ఇంజినీర్, ఈఆర్ఓ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులకు ఇబ్బందులు
తప్పనున్నాయి.
-సూర్యాపేట, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : జిల్లా అభివృద్ధ్దిపై మంత్రి జగదీశ్‌రెడ్డి మరోసారి తన మార్క్ చూపించారు. సొంత నియోజకవర్గం అయిన సూర్యాపేటకు పెద్ద పీట వేస్తూ మిగిలిన మూడు నియోజకవర్గాలకు వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.23 వేల కోట్లు మంజూరు కాగా, జిల్లా కేంద్రంగా మారి న సూర్యాపేట పట్టణం, నియోజకవర్గానికి రూ.11 వేల కోట్ల వరకు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యాపేటలో ఇప్పటికే మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలు, ఎస్పీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో పాటు చెప్పడానికి చేంతాడంత జాబితాకు పైనే అభివృద్ధ్ది పనులు జరుగుతూ ప్రగతి వైపు పరుగులు పెడుతున్నది. మంత్రి సొంత శాఖ విద్యుత్ రంగం వెలుగుతున్నది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇప్పటికే విద్యుత్ స్టోర్స్‌ను మంజూరు చేయించడంతో మారుమూల రైతాంగానికి పని సులువుగా మారింది. తాజాగా సమీకృత విద్యుత్ సర్కిల్ కార్యాలయం మంజూరైంది. దీనికి రూ.7.15 కోట్లు మంజూరు చేశారు. విద్యుత్ వినియోగదారులకు అనువుగా ఒకే చోట విద్యుత్ కార్యాలయాలు ఉండే విధంగా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి మంజూరు చేయించారు. ఒకే పని మీద విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన చేసుకోకుండా ఉండేందుకు చేసిన ఈ ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రాంగనంలో ఈ సమీకృత కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు ఈ నెల 30న భవన నిర్మాణ పనులను మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు విద్యుత్‌శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో సమీకృత విద్యుత్ శాఖ కార్యాలయాల భవనాలు నిర్మించడంతో ఇకపై విద్యుత్ వినియోగదారులకు పనులు సులభతరం అవుతాయి.