– ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు విద్యార్థి నాయకుల వినతి
రామగిరి, మే 29 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం వర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. రోస్టర్ రిజర్వేషన్ విధానం పాటించకుండా, పత్రిక ప్రకటనలు సరైన విధంగా ఇవ్వకుండా, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం లేకుండా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ అంశంపై యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందించకపోవడంతో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి వివరాలు తెలియజేసినట్లు వెల్లడించారు. విద్యార్థి సంఘ నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. గతంలో నవీన్ మిట్టల్ వైస్ ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో కూడా 33 మంది డైలీవేజ్ ఉద్యోగులను రోస్టర్ రిజర్వేషన్, పత్రిక ప్రకటనలు లేకుండా అక్రమంగా నియమించారని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన నియామకాలలో కూడా నిరుద్యోగుల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసి 100కు పైగా అక్రమ నియామకాలు చేపట్టినట్లు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఆ ఏజెన్సీకి యూనివర్సిటీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనులు ఇవ్వకుండా బ్లాక్‌లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రస్తుతం జరిగిన నియామకాలను పూర్తిగా రద్దు చేసి, తిరిగి పారదర్శకంగా నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి నాణ్యత కలిగిన విద్యావంతులను ఎంపిక చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ జిట్టా బాలకృష్ణ రెడ్డి విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరించి, ఈ అంశంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా యూనివర్సిటీ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పోలగోని శివ, రాజేష్, యశ్వంత్, రామ్, జితేందర్, సంజీవ పాల్గొన్నారు.