– ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి
– బడుగుల పిల్లలకు తిండి పెట్టలేని దుస్థితి
– సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం
– కోదాడలో విద్యార్థుల ర్యాలీని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, సెప్టెంబర్ 05 : ఎన్నికల్లో గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర ఏండ్లు కావస్తున్నప్పటికీ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేక అచేతనంగా ఉందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం కోదాడ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు నిర్వహించిన నిరసన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ర్యాలీ ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి బస్టాండ్ మీదుగా రంగా థియేటర్ చౌరస్తా వరకు సాగింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక కళాశాలల యాజమాన్యాలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందన్నారు.

‘విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేని చేతకాని ప్రభుత్వం’
బకాయిలు అడిగిన విద్యాసంస్థల యాజమాన్యాలను ఈ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు కనీసం సరైన తిండి కూడా పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. పురుగుల అన్నం పెడుతుండటంతో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని, గురుకులాల్లో పాముకాట్లకు గురై విద్యార్థులు మృత్యువాత పడుతున్న సంఘటనలు నిత్యం కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో పౌష్టికాహారానికి సంబంధించి నాలుగు నెలలుగా టెండర్లను ఖరారు చేయకుండా మంత్రులు తమ వాటాలు, కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
మరోవైపు నిరుద్యోగులకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు జారీ చేసి ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ ప్రభుత్వం నియామక పత్రాలను అందిస్తూ తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. తక్షణమే విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, పెండింగ్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసి ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అడుగడుగునా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి వంశీ, కౌన్సిలర్ చీమ నరేశ్, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

‘విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేని చేతకాని ప్రభుత్వం’