Gyanesh Kumar : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మూడు రోజులుగా ఆందోళన చేస్తూనే ఉంది. అక్టోబర్ 2, గాంధీ జయంతి నుంచి ఆప్ ఆందోళన కొనసాగిస్తోంది. ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆప్ నేతలు బ్యారికేడ్లు ఎక్కి మరీ జంతర్ మంతర్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కార్యకర్తలతోపాటు ఆ పార్టీ విద్యార్థి విభాగం ఏఎఎస్ఏపీ కూడా ఆందోళనల్లో పాల్గొంటోంది.
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వీరు ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను కార్యకర్తలు బ్లాక్ చేశారు. అలాగే, బస్సుల్ని కూడా కదలనివ్వలేదు. దీంతో ఆందోళనకారుల్ని అడ్డు తొలగించేందుకు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు, ఇతర విభాగాల భద్రతా బలగాలు ప్రయత్నించాయి. దీంతో నిరసనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఆందోళనల్లో ఢిల్లీ ఆప్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే సంజీవ్ ఝా, నేహా బోరా వంటి కీలక నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు బారికేడ్లు దాటి జంతర్‌మంతర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా వీరిని పోలీసులు లాక్కెళ్లి అరెస్టు చేశారు. సౌరభ్ భరద్వాజ్ సహా కీలక నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనను ఒక ఫుట్బాల్లాగా విసిరేశారని సౌరభ్ ఆరోపించారు. ఉద్యమకారులతోపాటు అక్కడే ఉన్న కొందరు జర్నలిస్టులపై కూడా పోలీసులు దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఆందోళనల్ని అరికట్టేందుకు దాదాపు 5,000 మందికిపైగా పోలీసుల్ని మోహరించినట్లు తెలుస్తోంది.