దేవరకొండ, అక్టోబర్ 05: గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సైతం పట్టుదల, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించగలరని దేవరకొండ ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు నిరూపించాడు. గోవాలో ఇటీవల నిర్వహించిన ‘ఆలిండియా మల్టీ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ – 2026’ అండర్-17 వాలీబాల్ పోటీల్లో మండల పరిధిలోని రేగళ్ల తండాకు చెందిన రమావత్ దీక్షిత్ స్వర్ణ పతకంతో సత్తా చాటాడు.
మగాలోనిబావి గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల తండాకు చెందిన దీక్షిత్ రంగా రెడ్డి జిల్లా తరఫున అండర్-17 విభాగంలో ప్రతినిధ్యం వహించాడు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో గోవాలో జరిగిన జాతీయ స్థాయి క్రీడోత్సవంలో దేవరకొండ కుర్రాడు అదరగొట్టాడు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రామిసింగ్ జట్లపై మెరిసిన అతడు ఫైనల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో రంగారెడ్డి విజయంలో కీలకమయ్యాడు.
మారుమూ తండాకు చెందిన రమావత్ దీక్షిత్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడంతో పలు తండాల్లో హర్షాతికేతాలు వ్యక్తమవుతున్నాయి. దీక్షిత్ స్వర్ణం సాధించడం పట్ల రేగళ్ల తండా, మగాలోనిబావి గ్రామ పంచాయతీతో పాటు దేవరకొండ పరిసర ప్రాంతాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు దీక్షిత్‌ను, అతడి కుటుంబ సభ్యులను అభినందించారు. భవిష్యత్తులో దీక్షిత్ అంతర్జాతీయ స్థాయి వేదికలపై కూడా పతకాలు గెలిచి భారత్‌కు పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.