Flydubai : ఫ్లైదుబాయ్ విమానం (Flydubai flight) లో పైలట్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar) పై దాడికి పాల్పడిన కోపైలట్ (Co-pilot) హమామ్ అల్ హమామీ (Hamam al-Hammami) విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించానని చెప్పాడు. చావంటే తనకు ఏమాత్రం భయం లేదని దర్యాప్తు అధికారులతో అన్నాడు. ఇజ్రాయెల్ (Israel) కు వెళ్తున్న FZ1073 విమానంలో పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించానని, ఆ తర్వాత పథకం ప్రకారం దాడికి పాల్పడ్డానని హమామ్ ఒప్పుకున్నాడు.
తాను ప్రార్థన చేసుకుంటానని చెప్పి కెప్టెన్ దృష్టి మరల్చి, విమానంలోని గొడ్డలితో దాడికి యత్నించినట్లు కోపైలట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దర్యాప్తు బృందాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతోగానీ, ఇరాన్తోగానీ ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతున్నది. హమామ్ యూఏఈలో జన్మించాడు. అతడి తండ్రి ఒమన్‌కు, తల్లి సిరియాకు చెందినవారు. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు అతను ఒమన్, సిరియా, మొరాకోలలో ఉన్నాడు.
సిరియాలో ఎక్కువ కాలం నివసించినందున అక్కడి సుదీర్ఘ అంతర్యుద్ధం సమయంలో అతను ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అతని సోషల్ మీడియా ఖాతాల్లో వేలకొద్ది ఉగ్రవాద సంబంధిత పోస్టులు, సందేశాలను అధికారులు గుర్తించారు. అయితే ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాన్ని మాత్రం అతను ఇంకా వెల్లడించలేదు. కేసులో విచారణ కొనసాగుతున్నది.