తుంగతుర్తి, మే 14 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిరుపయోగంగా ఉందని, ఈ భవనాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు బుధవారం తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పెళ్లిలు, శుభకార్యాలు, సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటదని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి ఓ అంబేద్కర్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.
ప్రస్తుత తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు గెలిచిన నెల రోజులకే ఆయన పేరుతో శిలాఫలకం పెట్టుకుని ఆ భవనాన్ని ప్రారంభించి గాలికి వదిలేసినట్లు ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భవనానికి విద్యుత్ సౌకర్యం, నీటి సదుపాయం, ప్రహరి నిర్మించి వెంటనే వినియోగంలోకి తేవాలని కోరారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి మధు, తడకమళ్ల మల్లికార్జున్, బోయిని కొమరయ్య, పోతరాజు మహేశ్, కొండగడుపుల నాగరాజు పాల్గొన్నారు.