భువనగిరి కలెక్టరేట్, మార్చి 18 : నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్‌కు నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలపై ఉద్యోగులు చేపట్టిన 48 గంటల వంట వార్పు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను ఎత్తివేయొద్దని, మొబైల్ అంగన్వాడీ సెంటర్స్‌ను తీసివేయాలని, వేసవి సెలవులు ఇవ్వాలని, బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీలకు నెలకు 18 వేలు ఇస్తామని, పీఎఫ్ కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ లు చేయాలని, బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కలెక్టర్ హనుమంతరావుకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బురుగు స్వప్న, చిలువేరు రామకుమారి, నాయకులు మాయ కృష్ణ, కొల్లూరు ఆంజనేయులు, కళ్యాణి, గంగుల రమ, పద్మ, రుక్మిణి, ప్రమీల, వసంత, సయేదా, ఉమ, జ్యోతి, శ్యామల, సునీత, సుజాత, సైదమ్మ పాల్గొన్నారు.