దామరచర్ల, ఆగస్టు 1 : వచ్చే ఏడాది జనవరి వరకు యాదాద్రి పవర్‌ప్లాంటులోని అన్ని యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంటులో 730 కోట్ల వ్యయం తో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు భూమిపూజ, మొదటి యూనిట్‌ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, మైనా ర్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్‌ప్లాంటును పర్యావరణ క్లీయరెన్స్ తీసుకురాక పోవడం వల్ల రెండేండ్లు పనులు ఆలస్యమైనట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యావరణ అనుమతులు తీసుకొని ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసి స్టేజీ 1లోని రెండు యూనిట్లను ప్రారంభించామన్నారు.
స్టేజీ 2లో మిగతా యూనిట్లను ఈ ఏడాది డిసెంబర్ వరకు పూర్తి చేస్తామన్నారు. విద్యుత్ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలపై పడే భారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి ప్లాంటులో పనిచేసే సీఈ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, పరిశ్రమకు తోడ్పాటునందించిన గ్రామస్తుల పిల్లల ఉన్నత చదువుల కోసం ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనితో పాటు ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు దవాఖాన, అంబులెన్స్ సేవలను అందిస్తామన్నారు. సిబ్బందికి క్వార్టర్స్ కోసం భూమిపూజ నిర్వహించామన్నారు. పెద్ద వాహనాల రవాణాతో గ్రామా ల్లో రహదార్లు దెబ్బతినకుండా ప్రత్యేకంగా సీసీరోడ్డు వేస్తున్నామన్నారు. నిర్వాసితులకు అన్ని రకాల న్యాయం చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు కింద నష్టపోయిన నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీతో పాటుగా యా దాద్రిలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యా దాద్రి, పులిచింతల నిర్వాసితులకు న్యా యం చేస్తామని తెలపడం హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యాదాద్రిలో నిర్వాసితులతో పాటుగా స్థానికంగా అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరారు.
వచ్చే ఏడాది జనవరి వరకు మిగతా స్టేజీ 2 ప్లాంటు పనులను పూర్తి చేసి జనవరి 26లో విద్యుత్ ఉత్పత్తిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం యాదాద్రి పవర్‌ప్లాంటులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి, పాఠశాల ఏర్పాటు చేయాలని, ప్రత్యేక సీసీరోడ్డు నిర్మాణానికి భూ సేకరణకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే విష్ణుపురం డబుల్‌లైన్ మంజూరైందని, ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదని గుర్తు చేశారు. 93 కిలోమీటర్ల డబుల్‌లైన్‌కు కేంద్రం నిధులు విడుదల చేయక పోవడం వల్ల ఆలస్యం అవుతోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి రూ.280 కోట్లు మంజూరు చేయడమే కాకుండా క్లీయరెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సీఎండీ హరీశ్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, సివిల్ డైరెక్టర్ అజయ్ తదితరులున్నారు.