నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) ;కాంగ్రెస్ పార్టీ యమ డేంజర్ అని ఆ పార్టీ నేతలతో ప్రజలకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి… 58 ఏండ్లు మనల్ని ఏడిపించిందే కాంగ్రెస్ పార్టీ అని మరోమారు గుర్తుచేశారు. మూసీ మురికి నీళ్లకు, ఫ్లోరైడ్ పాపానికి కారణమైన ఆ పార్టీని గంగలో కలుపాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో12కు 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, అభివృద్ధికి అండగా నిలువాలని కోరారు. సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభతో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన ముగిసినైట్లెంది. సభలన్నీ జనసంద్రంగా మారి సూపర్ సక్సెస్ అయ్యాయి. బీఆర్ఎస్ శ్రేణులతోపాటు సామాన్య ప్రజలను సైతం సీఎం కేసీఆర్ ప్రసంగాలు ఆలోచనల్లో పడేస్తున్నాయి. మరోసారి బీఆర్ఎస్ గెలుపును ఖరారు చేసే దిశగానే సభలు సాగడంతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
క్షేత్రస్థాయిలో భూమి అనుభవదారు ఒకరు.. రికార్డుల్లో పట్టాదారు మరొకరు.. కబ్జాదారు ఇంకొకరు. పహాణీ కథ ఒకటి.. ఆర్వోఆర్ కథ ఇంకొకటి.. ఇది నాటి రెవెన్యూ రికార్డుల పరిస్థితి. వీఆర్వో మారిండంటే కబ్జా కాలంలో పేర్ల మార్పులు..పాస్ పుస్తకాల్లో భూమి హెచ్చుతగ్గులు..ఎకరికి డబ్బు లేదా పలుకుబడి ఉంటే రికార్డుల్లో వారిదే ఆధిపత్యం. ఫలితంగా భూమి తమదంటే తమదని పోలీస్ స్టేషన్లో గొడవలు.. కోర్టుల్లో దావా(కేసు)లు. రెవెన్యూ అధికారికి తెలియకుండానే వెబ్ ల్యాండ్ వెబ్‌సైట్‌ను ఆపరేటరే మార్చే అవకాశం ఉందంటే ఆ రికార్డుల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇలాంటి రికార్డులను ప్రక్షాళన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డులపై తాసీల్దార్‌కు మాత్రమే పూర్తి అవకాశం కల్పిస్తూ పది నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా ధరణినిని తీసుకొచ్చింది. దాంతో వివాదాలు లేకుండా రైతులు తమ భూములపై హక్కులు పొందుతున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చి మళ్లీ పాత పద్ధతే అమలు చేస్తామని పార్టీ నాయకులు చెప్పడం రైతులకు ఆందోళన కలిగిస్తున్నది.
నాటి పహాణీలో 32 కాలమ్స్
పహాణీ భూమి వివరాలతో కూడిన ప్రధాన రికార్డు. ఇందులో ఏ గ్రామం.. ఏ సర్వే నంబర్.. ఏ రైతు భూమి ఎక్కడ ఉంది అనే వివరాలు ఉంటాయి. అలాంటి రికార్డుల్లో 32 కాలమ్స్ ఉండేవి. పహాణీలో పట్టాదారు కాలంతో పాటు కబ్జాదారు, వ్యవసాయానికి యోగ్యమా..కాదా, భూమి శిస్తు ఉందా? లేదా? లాంటి అంశాలతో అనేక అనవసరమైన కాలమ్స్ కలిపి 32 ఉండేవి. దాంతో భూమి పట్టా ఒకరి పేరు మీద.. కబ్జా మరొకరి పేరుమీద ఉండేది. వీఆర్వో మారిండంటే చాలు డబ్బులకో లేదా అధికార బలానికో ఆ రికార్డుల్లో మార్పులు చేర్పులు జరిగేవి. అంటే రికార్డులు అధికారులను బట్టి మారుతుండేవి. రెవెన్యూ అధికారిక వెబ్సైట్ అయిన వెబ్‌ల్యాండ్‌లో అన్ని భూముల వివరాలు, పట్టాదారుల వివరాలు నమోదు చేస్తుండగా ఆ వెబ్లాండ్లో భూమి ఎక్కువ లేదా తక్కువ వంటివి ఆపరేటర్ కూడా మార్చే చేసే అవకాశం ఉందంటే ఆ వెబ్సైట్ ఎంత వెసులుబాటో అర్థమైతుంది.
రిజిస్ట్రేషన్ చేసుకున్నా భూ మార్పిడికి కష్టాలు
ధరణి అమలుకు ముందు భూమి రిజిస్ట్రేషన్లు ఆఫీసుల్లో చేసుకుంటుండగా పాస్ పుస్తకాలు మాత్రం రెవెన్యూ అధికారులు ఇచ్చేవారు. రిజిస్ట్రేషన్ అనంతరం వీఆర్వోకు డాక్యుమెంట్స్ ఇచ్చి మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వమంటే నెలల తరబడి కొందరైతే ఏండ్ల తరబడి తిప్పించుకునేవారు. ఆ తర్వాతైనా చేయి తడపనిదే పుస్తకమొచ్చేది కాదు. దానికి తోడు పహాణీల్లో పట్టాదారు, కబ్జాదారు కాలంలో పాత పేర్లే పునరావృతం అయ్యేవి. దాంతో పట్టాదారు ఒకరు, కొన్నది మరొకరు, కబ్జాదారు ఇంకొకరు. ఈ వివాదం పరిష్కరించుకునేందుకు పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఉండేది. వీఆర్వోలకు అవగాహన లేక రికార్డులు అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా భూ తగాదాలు జరిగేవి.
ధరణితో పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్..
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూమిని పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఇది కూడా తాసీల్దార్ పరిధిలోనే ఉండడంతో అమ్మకందారు పాస్ పుస్తకం ఆధారంగా భూమి వివరాలు ధరణి వెబ్సైట్లో చూసి రిజిస్ట్రేషన్ అనంతరం అమ్మిన వ్యక్తి పుస్తకం నుంచి ఆ భూమి తొలగించి కొన్న వ్యక్తి పేరుతో నమోదు చేసి కొత్త పుస్తకం ఇస్తున్నారు. ఇది కూడా పది నిమిషాల్లోనే పూర్తవుతున్నది. వీఆర్వోలతో పని లేకపోవడం..రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పోవడం వంటి బాధలు తప్పడంతో సమయం, డబ్బులు ఆదా అవుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ధరణి ఎత్తివేస్తే రైతులకు మళ్లీ కష్టాలే
ధరణి రావడంతో రైతుల కష్టాలు తీరనై. ధరణి ఎత్తేస్తే భూ వివాదాలు మళ్లీ మొదటికొచ్చినట్లే. కాంగ్రెస్ పాలనలో అధికారులు డబ్బులు దండుకొని ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా నమోదు చేశారు. ప్రభుత్వ భూములకు సైతం పట్టాలు అందించారు. దాంతో నిత్యం గొడవలే. భూ వివాదాలతో రైతులు సతమతమయ్యేది. తెలంగాణ రాకముందు డబ్బులు ఉన్నోళ్లకే అధికారులు పట్టం కట్టేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాత పద్ధతి తీసేసి ధరణి తీసుకొచ్చారు. దాంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పట్టాలు అందుతున్నాయి. కాంగ్రెస్ వాళ్లు వస్తే ధరణి తీసేసి పాత పద్ధతి పెడతామంటున్నరు. రికార్డులో పట్టారుతో పాటు కౌలు రైతులకు హక్కులు కల్పిస్తామని, వారికి కూడా రైతుబంధు అందిస్తామని చెబుతున్నరు. కానీ ఈ విధానం వల్ల రైతు, కౌలు రైతుల మధ్య చిచ్చు పెట్టినట్లే అవుతుంది. రైతులెవరూ భూములు కౌలుకు ఇవ్వరు. దాంతో చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయానికి దూరమవుతరు. గొడవలు పెట్టి అనందించడమే కాంగ్రెస్ నాయకుల ఉద్దేశ్యం. మళ్లీ ఆ బాధలు మాకొద్దు.
-మల్లోజు జగన్ చారి, గొడకొండ్ల, చింతపల్లి మండలం
కౌలుదారు చట్టంతో రైతులకు తిప్పలే
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలుదారు చట్టం తీసుకొస్తామంటున్నారు. ఆ చట్టం తీసుకొస్తే రైతులకు, కౌలు దారులకు మధ్య నిత్యం యుద్ధమే. ఉద్యోగం, వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తమ భూమిని గ్రామంలోని ఇతర రైతులకు కౌలుకు ఇస్తున్నరు. కాని కాంగ్రెసోళ్లు తీసుకొస్తామన్న భూ మాతతో కౌలుదారుకు కూడా హక్కులు కల్పిస్తే భూ యజమానికి, కౌలుదారుడి ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంటుంది. దీనిని ఆసరా చేసుకొని కౌలుదారుడు తనకు కూడా భూమి మీద హక్కు ఉందని వాదించే ప్రమాదమూ ఉంటుంది. ఈ గొడవలతో గ్రామాల్లో అశాంతి నెలకొంటుంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితోనే రైతులకు మేలు జరుగుతున్నది. దీని ద్వారా భూ యజమానికే సర్వహక్కులు ఉంటాయి. ఇప్పుడు భూములు కౌలుకు ఇచ్చినా నిశ్చింతగా ఉంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు పాతపద్ధతి తీసుకొస్తామనడాన్ని రైతులు వ్యతిరేకించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ సమస్యల పరిష్కారానికి ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేటోళ్లం. మళ్లీ అలాంటి ఇబ్బందులు పడేందుకు మేము సిద్ధంగా లేము. కాంగ్రెస్ వస్తే రైతులకు ఇబ్బందులే తప్పా మేలు జరుగదు.
– సంకలమద్ది జగన్‌రెడ్డి, రైతు, గండ్రవానిగూడెం, మాడ్గులపల్లి మండలం
భూమిలేని రైతులను వ్యవసాయానికి దూరం చేయడమే
భూమిలేని రైతులను వ్యవసాయానికి దూరం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాద పద్ధతి తీసుకొస్తామని చెబుతున్నది. నేను ఐదేండ్లుగా గ్రామంలో 15 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌలు చట్టం తీసుకొచ్చి భూ యజమానికి మాకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నది. ఈ విధానం వల్ల భూ యజమానులు మాలాంటి వారికి భూమి కౌలుకు ఇవ్వకుండా పోయే ప్రమాదం ఉంది. భూమి ఉన్న రైతు ఇతరులకు కౌలుకు ఇస్తున్నట్లు ఎలాంటి పత్రం ఇయ్యడు. ఒక వేళ ఇయ్యమంటే అసలు భూమే కౌలుకు ఇయ్యడు. అప్పుడు నేను ఏం పని చేసుకొని బతకాలి. వ్యవసాయం చేసుకునే రైతులకు అండగా ఉండేది పోయి వ్యవసాయానికి దూరం చేయడం మంచిది కాదు. అందుకే రైతుల గురించి ఆలోచించే పార్టీకే మా మద్దతు ఉంటుంది.
-పూదరి యాదయ్య, దామెర, నాంపల్లి మండలం
ధరణి తీసేస్తే దళారుల రాజ్యమే
ధరణి తీసేసి పాత పద్ధతి పెడితే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది. రైతులు అదే గోస పడాల్సి వస్తుంది. పైరవీలు, లంచాలు ఇచ్చిన వాళ్లకే భూమి హక్కులు వస్తాయి. రైతుతోపాటు కౌలుదారులకు హక్కులు కల్పిస్తే ఇద్దరి మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఈ గొడవలన్నీ తొలగించేందుకే సీఎం కేసీఆర్ ధురణి తీసుకొచ్చారు. ప్రస్తుతం ధరణితో క్షణాల్లో పని పూర్తవుతున్నది. భూరికార్డుల గజిబిజి అసలే లేదు. ఎవరి పేరుమీద ఎంత భూమి ఉందో స్పష్టంగా రికార్డులో, మాకు ఇచ్చే పాస్‌పుస్తకాలు నమోదై ఉంది. భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా క్షణాల్లో పనవుతున్నది. దాంతో ప్రస్తుతం రైతులందరూ సంతోషంగా ఉన్నరు. యావత్ దేశానికి ధరణి మార్గదర్శకంగా ఉంటే.. దానిని తీసేస్తామనడం సరికాదు. గతంలో భూ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రికార్డులో మార్చడానికి ఏండ్ల తరబడి తాసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా పని అయ్యేది కాదు. చేయి తడపందే ఫైలు ముందుకు కదిలేది కాదు. ఒకరి పేరిట ఉన్న భూములను పట్టాదారుకు తెలియకుండా పలుకుబడి ఉన్న వ్యక్తుల పేరిట నమోదు చేసేవారు. ఆ పాత పద్ధతి బాగాలేదు. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణే బాగుంది. అదే ఉండాలి. మళ్లీ అదే ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నం.
– కుర్ర స్వామి, రైతు, బాల్నెంపల్లి,అడవిదేవులపల్లి మండలం
ధరణి రద్దు చేస్తే దళారులకు దారి ఇచ్చినట్లే
తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చొరవతో నిజాం కాలంనాటి భూముల రికార్డులను ప్రణాళికాబద్ధంగా తయారు చేసి ధరణి పోర్టల్ రూపొందించారు. ధరణి రైతులకు నిజంగా వరమే. కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, దాని బదులుగా పాత పద్ధతి తెస్తామని చెబుతున్నరు. భూ మాత పోర్టల్ వస్తే మాలాంటి రైతుల నోట్లో మట్టికొట్టినట్లే అవుతుంది. దాని ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుతో పాటు అనుభవ దారు పేరు కూడా నమోదు చేస్తారు. దాంతో నిత్యం వివాదాలే. భూ రికార్డులు కూడా రెవెన్యూ అధికారులు ఇష్టమొచ్చినట్లు మార్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మార్పు చేయాలంటే ఏండ్ల తరబడి వారి చుట్టూ తిరిగిన రోజులు ఇప్పటికీ గుర్తున్నయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో ఎలాంటి పంచాయితీలు లేవు. మా భూమి ఎంత ఉందనేది ఆన్లైన్లో దర్శనమిస్తుండడంతో రికార్డుల్లో అవకతవకలకు ఆస్కారమే లేదు. కౌలుదారులకు కూడా మా భూముల్లో హక్కులిచ్చి ఇద్దరి మధ్య గొడవలు పెట్టే పార్టీలు మాకు అక్కర లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎంతగానో మంచి చేసింది. ధరణి ఉంటేనే మంచిది ఇది పోతే మాత్రం గోస పడతాం.
-కటికం అమృతారెడ్డి, రైతు, జువ్విగూడెం, నార్కట్‌పల్లి మండలం