అసెంబ్లీ ఎన్నికల పర్వంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను తేల్చుకోలేక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. ఇప్పటికే బీ ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకుపోతూ నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు మాత్రం నేటికీ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులెవరో తేల్చుకోలేక పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మూడు స్థానాల్లో అనిశ్చితి కొనసాగుతుండగా.
బీజేపీ గురువారం మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ఇన్నాళ్లూ వేచిచూసిన సీపీఎం.. ఒంటరిగా పోటీకి సిద్ధపడింది. జిల్లాలో మొత్తం ఆరు స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. సీపీఐ విషయంలో కాంగ్రెస్‌తో పొత్తు, పోటీ స్థానాలపై నేడు స్పష్టత రానున్నట్లు తెలిసింది. ఓ వైపు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో తనదైన
శైలిలో దూసుకుపోతుంటే.. విపక్షాల్లో నెలకొన్న గందరగోళంపై ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : గత నెల 9న ఎన్నికల షెడ్యూల్ వెలువడగా, నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 5న ఆదివారం మినహా 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 11, 12 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో 13న నామినేషన్ల పరిశీలన చేపడుతారు. 15వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉండగా, అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించనున్నారు. మధ్యలో 14 రోజుల గడువుతో ఈ నెల 30న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.
ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఎదురుచూసిన వామపక్షాలకు కాంగ్రెస్ మొండిచేయి చూపింది. ముఖ్యంగా సీపీఎం ఇచ్చిన డెడ్‌లైన్ గురువారంతో ముగియడంతో ఆ పార్టీ పోటీకి సిద్ధమైంది. రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేస్తామని, అందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, హుజూర్నగర్, కోదాడ, భువనగిరి స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించింది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఇక సీపీఐ మాత్రం శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో పోటీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకపోతే సీపీఐ కూడా మునుగోడు, దేవరకొండ, ఆలేరులో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని ఆశావహులంతా బీఎస్పీ లేదా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ గొప్పలకు పోయిన బీజేపీకి చివరకు పోటీ చేసేందుకు కాస్తోకూస్తో బలమైన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. ఉన్నంతలో బెట్టర్ అభ్యర్థుల కోసం గాలిస్తూ గురువారం మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్లగొండకు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, దేవరకొండకు లాలూనాయక్, హుజూర్‌నగర్‌కు చల్లా శ్రీలతారెడ్డి, ఆలేరుకు పడాల శ్రీనివాస్‌ను ప్రకటించింది. అంతకుముందే సూర్యాపేట, తుంగతుర్తి, నాగార్జునసాగర్‌కు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక మిగిలిన నకిరేకల్, కోదాడ, మిర్యాలగూడ, మునుగోడుకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో పొత్తులో భాగంగా జనసేనకు ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించవచ్చని తెలుస్తున్నది. కాగా, ప్రకటించిన సీట్లల్లోనూ టికెట్లు ఆశించిన నేతల్లో అసమ్మతి నెలకొంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. నల్లగొండలోనూ టికెట్టు ఆశించిన కన్నంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
అధికార బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం ఆది నుంచే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుండగా.. విపక్షాలు మాత్రం నేటికీ గందరగోళంతో సతమతమవుతున్నాయి. ఇలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చి రాష్ర్టాని ఏలుతాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నేతల మధ్య ఆధిపత్య పోరు, టికెట్ల అమ్మకాల ఆరోపణలు, జంప్‌జిలానీలకు టికెట్లు ఇలా ఎన్నెన్నో సిత్రాలకు విపక్షాలు వేదికగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో నేటికీ కాంగ్రెస్ పార్టీ మరో మూడు స్థానాల్లో అభ్యర్థులను తేల్చలేకపోయింది.
సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య టికెట్ కోసం హోరాహోరీ నెలకొన్నది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దామోదర్‌రెడ్డి కోసం పట్టుబడితే, రేవంత్‌రెడ్డి రమేశ్‌రెడ్డి కోసం పట్టువీడకుండా ప్రయత్నం చేస్తున్నాడు. తుంగతుర్తిలోనూ సీనియర్ నేత అద్దంకి దయాకర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుపడుతుండగా టికెట్‌పై అనిశ్చితి కొనసాగుతున్నది. ఇక మిర్యాలగూడలో పొత్తులో భాగంగా సీపీఎంకు కేటాయించవచ్చని గురువారం వరకూ కొనసాగిన సస్పెన్స్ వీడింది. వామపక్షాలతో పొత్తుపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో సీపీఎం పోటీకి సై అంటుంది. దీంతో ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.