యాదగిరిగుట్ట, మే 21: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి రానున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ వెల్లడించారు. శనివారం ఉదయం 9.37 గంటలకు టెంపుల్ సిటీపై రూ. 43 కోట్లతో వేద పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారన్నారు. గురువారం కొండపై ఉన్న తన కార్యాలయంలో ఈవో విలేకరులతో మాట్లాడారు.
కొం డపై దాతల సహకారం, దేవస్థాన బడ్జెట్, ప్రభుత్వ గ్రాంట్లు రూ. 100 కోట్లతో బాలాలయ ప్రాంతంలో నిత్య కల్యాణ మండపం, ఆలయానికి వాయువ్య దిశలోని లిప్టు పక్కన నుంచి తిరుమాడ వీధుల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకమైన మెట్ల మార్గం పనులు, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతంలోని శివాలయానికి వెళ్లే ప్రాం తంలో దీక్షాపరుల మండపం, భక్తులకు వసతి గృహాలు, వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే శ్రీవారిమెట్ల మార్గానికి ప్రత్యేకమైన సొరంగ మార్గం, ఫ్యాబ్రికేటెడ్ షెడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా స్వామివారి ఆలయాన్ని ఆరగంట ముందే తెరిచి, 5 గంటలకు స్వామివారి అభిషేకాలను ప్రారంభిస్తామన్నారు. కంచికామకోటి పీఠాధిపతి శంకరవిజయేంద్ర సరస్వతి శుక్రవారం మధ్యాహ్నం యాదగిరిగుట్టకు రానున్నట్లు తెలిపారు.