మహబూబ్నగర్ : తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు ( Pothireddypadu) కు బయలుదేరిన బీఆర్ఎస్ ( BRS ) మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ని ఏపీ పోలీసులు (AP Police ) అడ్డుకున్నారు. జూపాడు బంగ్లా నేషనల్ హై వే వద్ద కారును అడ్డుకుని పోతిరెడ్డిపాడుకు వెళ్లేందుకు అనుమతులు లేవని నిలిపివేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నీళ్లను ఏపీకి దోచిపెట్టే బానిస ప్రభుత్వం తెలంగాణలో నడుస్తుందని విమర్శించారు. శ్రీశైలం ( Srisailam Project ) ప్రాజెక్ట్ మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూద్దామని వచ్చాం. ఏపీ లో కూడా పంటలు పండాలి. అభ్యంతరం లేదు. కృష్ణానదిలో పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుంటున్నారు. గ్రావిటీతో నాలుగైదు టీఎంసీలను రోజు తీసుకుంటున్నారని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు వద్ద 802 మీటర్లు అడుగునా నీళ్లుంటే తెలంగాణ వైపు మోటార్లతో ఎత్తిపోయాల్సి ఉండగా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు. 162 కిలోమీటర్ల పొడవు ఉండే కాలువలో 102 కిలోమీటర్ల దూరం నీళ్లు వెళ్లలేదని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు దాచిపెడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో శ్రీశైలంలో వంద టీఎంసీలు నీళ్లు ఉన్నపుడు కూడా నలభై టీఎంసీల నీటిని రైతులకు అందించామని వెల్లడించారు. ఏపీ పోలీసులు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పాలమూరు జిల్లాకు నీళ్లు దక్కకుండా చేస్తున్నారని, జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.