ఆత్మకూరు(ఎం), నవంబర్ 1 : బీఆర్ఎస్ పాలనలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గత ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని.. మరింత అభివృద్ధి కోసం తనను మరోసారి ఆశీర్వదించాలని ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పుల్లాయిగూడెంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని, వారికి ఓటు అడిగే హక్కులేదన్నారు. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీని అందజేసి చరిత్రలో నిలిచిపోయిందన్నారు.
మరో సారి అవకాశం కల్పిస్తే ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పుల్లాయిగూడెం ఉప సర్పంచ్ రమేశ్‌తో పాటు 20 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
అనంతరం మండలంలోని కూరెళ్ల, రాఘవాపురం, దుప్పల్లి నర్సాపురం, లింగరాజ్‌పల్లి, పల్లెర్ల, సిద్దాపురం, తుక్కాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్, డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మోతె సోమిరెడ్డి, కెహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, సర్పంచులు బాషబోయిన ఉప్పలయ్య, పెసరు గిరిజ, నాయిని నరసింహారెడ్డి, దొండ కమలమ్మ, ఎంపీటీసీ అండాలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌గౌడ్, నాయకులు ఇంద్రారెడ్డి, భిక్షపతి, పురుషోత్తంరెడ్డి, భానుప్రకాశ్, యశ్వంత్, నర్సయ్య పాల్గొన్నారు.