నకిరేకల్, మే 10 : మోదీకి దమ్ముంటే ఆదానీ, అంబానీపై ఈడీ, ఐటీ రైడ్స్ చేయించి డబ్బులు బయటకు తీయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ పదేండ్ల పాలనలో దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దించాలని, కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నకిరేకల్ మినీ స్టేడియంలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జన జాతర సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగం అభద్రతలో పడినట్లేనన్నారు. ప్రాథమిక హక్కులు హరించబడతాయని తెలిపారు. ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం పేదల సంక్షేమం, రాజ్యాంగాన్ని సంరక్షించడమేనని చెప్పారు. మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా కార్పొరేట్లకు దారాదత్తం చేసిందన్నారు. ప్రజలను మోదీ రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. నాడు ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ అమలయ్యాయో చెప్పాలన్నారు. పదేళ్ల పాలనలో మోదీ మిత్రులే ధనవంతులయ్యారన్నారు.
సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు త్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు.