హుజూర్నగర్, ఆగస్టు 17 : హుజూర్నగర్ నియోజకవర్గంలో త్వరలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాల నిర్మాణానికి పాలకీడు మండలం, గుండ్లపహాడ్ పరిధిలోని ప్రభుత్వ భూమి, హుజూర్నగర్ మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నెంబర్ 1041లోని ప్రభుత్వ భూములు అనువుగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులతో కలిసి పాలకీడు మండలం గుండ్లపహాడ్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను, హుజూర్నగర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.
ఈ భూములకు రోడ్డు కనెక్టివిటీ ఉందని, సాగుకు భూములు అనువుగా ఉన్నాయని, నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా సాగునీరు అందుతుందని మంత్రి వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయ శంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ జానయ్య, డీన్ ఝాన్సీరాణి, డీఎస్ఏ వేణు, గోపాల్‌రెడ్డి, లింగయ్య, జిల్లా ఎస్పీ నరసింహా, ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్లు కమలాకర్ నాగార్జునరెడ్డి, ఏవో కళ్యాణ చక్రవర్తి సిబ్బంది పాల్గొన్నారు.