హాలియా మున్సిపాలిటీలో ఖజానా ఖాళీ అయ్యింది. రెండు నెలలుగా మున్సిపాలిటీలో పనిచేసి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. దాంతో పారిశుధ్య కార్మికులు అర్ధాకలితో పనిచేస్తున్నారు. కార్మికులు నెలనెలా ఇవ్వాల్సిన సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, మాస్క్‌లు కూడా లేవు. పీఎఫ్, ఈఎస్ఐ కూడా కార్మికుల ఖాతాలో జమ చేయడం లేదు.
గతంలో భాగానే ఉన్నా…
హాలియా పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్నది. పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో గ్రామ పంచాయతీగా ఉన్న హాలియాను శివారు ఇబ్రహింపేట గ్రామ పంచాయతీని కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 2021 జనాభా లెక్కల ప్రకారం హాలియా మున్సిపాలిటీ జనాభా 17,371 కాగా ప్రస్తుతం 20 వేల పైచిలుకు చేరింది. మున్సిపాలిటీలో 5,300 అవాసాలు ఉన్నాయి. గత ప్రభుత్వం 2019లో ఎన్నికల నిర్వహించగా 2020 జనవరిలో కొత్త పాలక వర్గం కొలువుదీరింది. 2021 నుంచి 2023 వరకు మున్సిపాలిటీ సజావుగానే సాగింది. గడిచిన నాలుగేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.60 కోట్లు విడుదల చేసింది. అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి వసతి, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డు ఏర్పాటు, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం, గిరిజన సంక్షేమ భవన్, ఇండోర్ స్టేడియం, వైకుంఠధామం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వంటి పనులు చేపట్టారు.
కొత్త పాలకవర్గం వచ్చాక..
2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత చైర్మన్ వెంపటి పార్వతమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి హాలియా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. కొత్త పాలకవర్గం అధికారంలోకి వచ్చాక హాలియా మున్సిపాలిటీ నిర్వహణ గాడి తప్పింది. మున్సిపాలిటీలో సలహాదారుల పెత్తనం ఎక్కువైందని సొంత పార్టీ పాలకవర్గ సభ్యులే ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో మున్సిపాలిటీలోని నిధులన్నీ ఖాళీ చేయడంతో గత రెండు మాసాలుగా మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది.
మున్సిపల్ సిబ్బందికి 2023 మే లో మేడే సందర్భంగా కార్మికులకు ఇచ్చిన రూ.1000 బోనస్ కూడా గత 16 నెలలుగా కార్మికుల ఖాతాలో జమచేయడం లేదు. పారిశుధ్య పనులు చేసే కార్మికులకు ప్రతి నెలా సబ్బుల బిల్లు, బెల్లం, కొబ్బరి నూనె ఇవ్వాల్సి ఉండగా అది కూడా లేదు. మాస్క్‌లు, కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. దాంతో మున్సిపల్ కార్మికులు జీతాలు రాక అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. జీతాల విషయంపై మున్సిపల్ కార్మికులు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్‌కు కూడా వినపపత్రం అందజేశారు. కానీ స్పందన లేదు. వేతనంతో పాటు నెలనెలా పీఎఫ్, ఈఎస్ఐ కూడా కార్మికులు ఖాతాలో జమచేయక పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఇల్లు గడువడం లేదు
రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల మా ఇల్లు గడవడం లేదు. అర్ధాకలితో పనికి వస్తున్నాం. మాకు సబ్బుల బిల్లు, బెల్లం, నూనె కూడా ఇవ్వడం లేదు. మా బాగోగుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్ని రోజుల ఇట్ల బతుకేది?
-నర్సమ్మ, కార్మికురాలు, హాలియా
కార్మికులకు నెలనెలా వేతనాలు ఇవ్వాలి
కార్మికుల సంక్షేమాన్ని హాలియా మున్సిపాలిటీ పాలకవర్గం గాలికి వదిలేసింది. రెండు నెలలుగా మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు వేతనం ఇవ్వకపోవడం బాధాకరం. కార్మికులు అర్ధాకలితో జీవిస్తున్నారు. సబ్బుల బిల్లు, బెల్లం, కొబ్బరి నూనె 15 నెలలుగా ఇవ్వడం లేదు. అక్టోబర్‌లో కార్మికులకు వేతనం ఇవ్వకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం.
– అవుతా సైదులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు