Tips For Diabetics | డయాబెటిస్ తో బాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆహారంలో మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ చక్కెర స్థాయిలు ఉదయం సమయంలో ఎక్కువగా ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి 8 గంటల మధ్యలో రోజంతటికీ శరీరాన్ని సిద్దం చేయడానికి కార్టిసాల్, గ్లూకాగాన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి. రక్తంలో అధికంగా ఉండే ఈ చక్కెర స్థాయిలు మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, నరాలు దెబ్బతినడం, దృష్టి లోపాలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. కనుక రక్తంలో చక్కెర స్థాయిలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
ఉదయం పూట ఆరోగ్యకరమైన దినచర్యను పాటించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు. ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిలను ముందుగా పరీక్షించుకోవాలి. దీంతో మనం ఎటువంటి ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. ఉదయం పూట ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండే అల్పాహారాన్ని తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. నిద్ర లేచిన తరువాత ఒక గ్లాస్ నీటిని తాగాలి. రాత్రంతా నీరు తాగకపోవడం వల్ల ఉదయం పూట శరీరం డీహైడ్రెటెడ్ గా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. నీరు తాగడం వల్ల అదనంగా ఉండే గ్లూకోజ్ బయటకు వెళ్తుంది. కనుక నిద్ర లేచిన తరువాత వెంటనే నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
రోజూ ఉదయం పూట 10 నుండి 15 నిమిషాల పాటు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అల్పాహారం తీసుకోవడానికి ముందు తేలికపాటి వ్యాయామాలు చేయడం, నడవడం వంటివి చేయాలి. తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఇన్సులిన్ అవసరం లేకుండానే శరీరం నుండి గ్లూకోజ్ బయటకు వెల్లిపోతుంది. అయితే ఖాళీ కడుపుతో బరువైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. ఉదయాన్నే కార్టిసాల్ స్థాయిలు తగ్గేలా 5 నిమిషాల పాటు లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం, ధ్యానం వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
అలాగే ఉదయం పూట తప్పకుండా అల్పాహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ సమయం తినకుండా ఉండడం వల్ల గ్లూకోజ్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఉదయం పూట చక్కెర కలిగిన జ్యూస్ లు తీసుకోవడం మానేయాలి. ఇవి నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కనుక చక్కెర లేని జ్యూస్ లు తీసుకోవడం, నీటిలో నిమ్మకాయ కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి. ఇవి కార్బొహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఉదయం పూట దినచర్యలో భాగంగా ఈ అలవాట్లను పాటించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా స్థిరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.