Chiranjeevi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని తమ కవల పిల్లలకు పెట్టిన పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియా, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పేర్లపై వస్తున్న ప్రశంసలతో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆనందంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చరణ్, ఉపాసనలతో కలిసి ఉన్న ఓ ఆత్మీయ ఫోటోను షేర్ చేస్తూ తన హృదయంలోని భావోద్వేగాలను అభిమానులతో పంచుకున్నారు.రామ్ చరణ్ దంపతులు తమ పిల్లలకు ఎంపిక చేసిన పేర్లు కేవలం ఆధునికంగా కాకుండా ఆధ్యాత్మిక మూలాలను ప్రతిబింబించేలా ఉండటం చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. మన సనాతన సంప్రదాయం, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన గర్వంగా ఫీలయ్యారు.
ఈ పేర్లలో దైవ కృప, భక్తి దాగి ఉన్నాయని… పవిత్ర దేవాలయాల ఆశీస్సులతో సిద్ధమైన పేర్లుగా ఆయన కొనియాడారు. తన మనవరాలి పేరులో చివరగా “దేవి” అన్న పదాన్ని చేర్చడం వెనుక ఉన్న భావం చిరంజీవిని ప్రత్యేకంగా కదిలించింది. తన బామ్మ అంజనా దేవి గారి జ్ఞాపకార్థం ఆ పేరులోని ‘దేవి’ని పాప అన్వీరా పేరులో చేర్చడం ఒక గొప్ప సంస్కారమని పేర్కొన్నారు. ఒక మనవడిగా తన నానమ్మపై చూపిన గౌరవం తనకు ఎంతో గర్వాన్ని ఇచ్చిందని చిరంజీవి భావోద్వేగంగా వెల్లడించారు. అభిమానులు కూడా ఇది కేవలం పేరు కాదు… కుటుంబ వారసత్వానికి ఇచ్చిన గొప్ప గౌరవమని అభిప్రాయపడుతున్నారు.
మెగా వారసుడికి “శివరామ్ కొణిదెల”, వారసురాలికి “అన్వీరా దేవి కొణిదెల” అని ఇప్పటికే చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఈ పేర్లు వినగానే స్నేహితులు, బంధువులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు తనకు అపార ఆనందాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.బాబు పేరులో శివుడు, రాముడు ఇద్దరి శక్తులు కలవడం… పాప పేరులో ధైర్యం, దైవత్వం ప్రతిఫలించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక చిరంజీవి షేర్ చేసిన ఫోటోలో ఆయన మధ్యలో నిలబడి చరణ్‌ను, గర్భవతిగా ఉన్న ఉపాసనను ఆప్యాయంగా హత్తుకోవడం మెగా ఫ్యామిలీ బాండింగ్ ఎంత బలంగా ఉందో చూపించింది. చిన్నారుల జీవిత ప్రయాణం దైవ దీవెనలతో అద్భుతంగా సాగాలని, చరణ్–ఉపాసనలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.