తూప్రాన్ : బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన పలువురు నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలోకి మారిన ఇద్దరు నేతలను ఓటర్లు తిరస్కరించారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో మామిండ్ల కృష్ణజ్యోతి, నందాల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్లుగా గెలిచారు. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మామిండ్ల కృష్ణజ్యోతికి మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని, నందాల శ్రీనివాస్‌కు వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇద్దరూ ఆ పార్టీలోకి మారారు.
ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఇద్దరినీ ఓడించి ఓటర్లు తగిన బుద్ధిచెప్పారు. నందాల రాధిక శ్రీనివాస్.. బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెల రాములు చేతిలో 311 ఓట్ల తేడాతో ఓడిపోయింది. మామిండ్ల కృష్ణజ్యోతి.. బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెల ప్రియాంక (రఘుపతి) చేతిలో 64 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది.