నల్లగొండ ప్రతినిధి, జనవరి10 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ చేతలకు పొంతన లేకుండా పోయింది. రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఎకరాకు పెట్టుబడి సాయంగా రూ.7500 అందిస్తామని చెప్పి… తీరా అధికారంలోకి రాగానే ఈ సారికి గతంలో మాదిరిగానే రూ.5వేలతోనే సరిపెట్టుకోవాలని ప్రకటించింది. కొత్త సర్కార్ కదా అని రైతులు సరేలే అనుకున్నా… ఆ డబ్బుకు కూడా భరోసా లేకుండా పోయింది.
నెల రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం రూ.147.38 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలకు చేరింది. మొత్తం నగదులో ఇది 11.83శాతమే కావడం గమనార్హం. 11.06లక్షల మంది రైతులు ఉండగా నేటికీ 4.06లక్షల మందికే రైతు భరోసా డబ్బులు జమైనట్లు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. మిగతా ఏడు లక్షల మందికి నిత్యం ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్ ముగింపు దశకు వచ్చినా పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందుగానే యాసంగి రైతుబంధు డబ్బులను రైతులకు అందించాలని అప్పటి కేసీఆర్ సర్కార్ రంగం సిద్ధం చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న విషయం తెలిసిందే. పైగా తాము అధికారంలోకి వచ్చిన మర్నాడే ఎకరాకు 7,500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటూ రైతులను మభ్యపెట్టింది. అధికారంలోకైతే వచ్చింది… కానీ రైతు భరోసా మాత్రం పెంచలేదు. కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ఈ సీజన్ వరకు 5వేల రూపాయలే ఇస్తామని ప్రకటించి గత నెల 10 నుంచి జమ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. వాస్తవంగా రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ పక్షం రోజుల్లోనే గత కేసీఆర్ సర్కార్ రైతుబంధు నగదు జమలు పూర్తి చేసేది. కానీ బుధవారం నాటికి 30 రోజులు పూర్తైనా నేటికీ జమ చేయాల్సిన మొత్తం నగదులో కేవలం 11.83శాతమే రైతుల ఖాతాల్లో పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11.06లక్షల మంది రైతులకుగానూ రూ.1245 కోట్లు పెట్టుబడి సాయంగా అందాల్సి ఉంది. ఇందులో నెలరోజుల్లో కేవలం 4.06లక్షల మంది రైతులకు గానూ రూ.147.38కోట్లు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 88.17శాతం నగదు జమ చేసే సరికి సీజన్ పూర్తై వానకాలం కూడా వస్తుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సరిగ్గా నెల రోజుల కిందట పెట్టుబడిసాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా తీవ్ర జాప్యం జరుగుతున్నది. నిత్యం రైతులకు తమ మొబైల్స్‌లో మెసేజ్ కోసం చెక్ చేసుకోవడం లేదా నేరుగా బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ను సరిచూసుకోవడమే సరిపోతుంది. కానీ ఎంతకూ రైతుభరోసా నగదు మాత్రం జమ కావడం లేదు. ఇలా నెల రోజులుగా రైతులు సతమతం అవుతున్నారు. ఆగిఆగి సాగుతున్న తీరుగా నేటికీ కేవలం 4.06లక్షల మంది రైతుల ఖాతాల్లో 147.38 కోట్లే జమయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో మొత్తం రైతులు 5.42లక్షల మంది కాగా 2.02లక్షల మంది ఖాతాల్లో రూ.624కోట్లకుగానూ రూ.77.47కోట్లు జమ అయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో మొత్తం 2.93లక్షల మంది రైతులకు గానూ 1.15లక్షల మంది ఖాతాల్లో రూ.317కోట్లకు రూ.44.06కోట్లు పడ్డాయి. ఇక యాదాద్రి జిల్లాలో మొత్తం 2.71 మంది రైతులకు గానూ 89వేల మంది రైతుల ఖాతాల్లో రూ.304 కోట్లకు 25.85కోట్ల నగదే జమ జరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇంకా 7లక్షల మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వీరికి గానూ మొత్తం రూ.1198కోట్ల పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. నెల రోజుల్లో కేవలం 11.83శాతం నగదే రైతులకు చేరితే మిగతా 88.17శాతం ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతుందనేది సందేహాస్పదంగా మారింది. దీనిపై వ్యవసాయ అధికారుల వద్ద సైతం సరైన సమాధానం లేదు.
కేసీఆర్ సర్కార్ హయాంలో 11 విడుతల్లో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.11,700 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా అందింది. 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. వరుసగా మొత్తం 11 సీజన్లల్లో క్రమం తప్పకుండా కచ్చితంగా అందజేస్తూ వచ్చారు. 2018 వానకాలం సీజన్ నుంచి ఎకరానికి నాలుగు వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు పెట్టుబడి సాయం అందించడం మొదలు పెట్టారు. 2018 డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి రాగానే వానకాలం నుంచి ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి 10వేల రూపాయల సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి గత వానకాలం సీజన్ వరకు ఎన్నడూ రైతుబంధు ఆగలేదు. పైగా సీజన్ సీజన్‌కు కొత్తగా పాసు పుస్తకాలు పొందిన ప్రతి రైతుకు సైతం పెట్టుబడి సాయం అందజేస్తూ వచ్చారు. ఒక్కసారి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి జమ కావడం మొదలైతే… చివరి రైతుకు అందే వరకు ఆగేది కాదూ. పక్షం రోజుల్లోనే పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే.
గత ప్రభుత్వ హయాంలో సమయానికి రైతు బంధు డబ్బులు పడడంతో వ్యవసాయ పెట్టుబడికి అప్పులు తెచ్చే అవసరం రాలేదు. ఈ సారి నాట్లు వేసి నెల రోజులైనా రైతు బంధు డబ్బులు పడలేదు. వాటి కోసం ఎదురు చూసి మందులకు, కూలీలకు అప్పులు తెచ్చినం. ఇంతకుముందు అప్పులు లేకుండా వ్యవసాయం చేయడంతో కొద్దో గొప్పో మిగిలేది. ఈ సారి పండించిన పంట అప్పులకే సరిపోయేటట్లున్నది.
– దేవిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, చిన్న మాదారం, కనగల్ మండలం
నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు. గతంలో వరి నాట్లకంటే ముందే బ్యాంకు ఖాతాలో పడేవి. నాట్లు వేసి నెల గడుస్తున్నా ఎదురు చూడడమే మిగిలింది. రైతు బంధు డబ్బులతో ఎరువులు, విత్తనాలు, కొంత కూలీలకు వాడుకునే వాడిని. ప్రస్తుతం డబ్బులు పడక పోవడంతో అప్పు తీసుకొచ్చిన. గతంలోనే రైతులకు బాగుంది.
– మునుగోటి బాలయ్య, రైతు, ఆరెగూడం, తిప్పర్తి మండలం