ఆత్మకూర్.ఎస్, జూన్ 13 : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచి వాటిని బతికించాలని సూర్యాపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. శుక్రవారం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది కన్నా ఈ ఏడాది 30 శాతం అడ్మిషన్లు పెంచే బాద్యత అధ్యాపకులు తీసుకోవాలన్నారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను జూనియర్ కళాశాలలో చేర్పించాలన్నారు.
ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వ పాఠశాలకు అందిస్తుందని, కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఒక పాఠశాలకు ఒక ఇన్చార్జి చొప్పున ఏర్పాటు చేసి ఒక్కొక్కరు 20 అడ్మిషన్లు చేయాలన్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి భానునాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,200 అడ్మిషన్లు ఉన్నాయని, ఈ ఏడాది 3,500కు పెంచే బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో పూర్తి స్తాయిలో అడ్మిషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ గునగంటి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.