ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 12 : రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్నది. దీంతో బోర్లు, వ్యవసాయబావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రభుత్వం సాగునీటిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల సాగు నీళ్లు లేక వరి పంటలు ఎండిపోయాయి. ఆత్మకూర్.ఎం మండలంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి చుక్క నీరు కనిపించడం లేదు. మండలంలో వానకాలంలో 19,735 ఎకరాల్లో వరి సాగుచేయగా యాసంగిలో 15వేల ఎకరాలకే పరిమితమయ్యారు. అయినా అవి కూడా నీళ్లు లేక పండుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని సర్వేపల్లి, తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోగా రైతులు పశువులు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.
మాకున్న 3ఎకరాల్లో వరి సాగుచేశాం. కాలం కలిసిరాక బోరు, వ్యవసాయ బావిలో పూర్తిగా నీళ్లు అడుగంటిపోయినయి. చేతికివచ్చిన పంట ఎండిపోయింది. పొట్టదశకు వచ్చిన మూడెకరాల పంట నీళ్లు లేకపోవడంతో పూర్తిగా ఆరిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సమయానికి రైతుబంధు, ఎరువులను అందజేసి రైతులను ఆదుకున్నడు. నేడు మూడెకరాల సాగు కోసం లక్షా20వేల రూపాయలు పెట్టుబడి పెడితే చేతికి రాకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. రైతు భరోసా ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా సీఎం రేవంత్రెడ్డి రైతుల పాలిట శాపంగా మారిండు.
– సోలిపురం బుచ్చిరెడ్డి, రైతు ఆత్మకూరు(ఎం)
కేసీఆర్ హయాంలో బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉండేవి. నాడు మాకున్న ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తే ఏ ఇబ్బంది లేకుండా పంటలు పండేవి. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత సాగు నీటి కష్టాలు వచ్చినయి. ఇప్పుడు యాసంగిలో అర ఎకరం సాగు చేసినా బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పంట ఎండిపోయింది. చేసేదేం లేక గొర్రెల మేతకు వదిలేశాం. ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం నష్ట పరిహారం అందివ్వాలి.
– సుదగాని వెంకన్న, సర్వేపల్లి