కట్టంగూర్, ఏప్రిల్ 08 : మండల పరిషత్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక పరిశీలనలో భాగంగా మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ప్రాణాళికయుతంగా ఖర్చు చేయాలన్నారు. ఖర్చుల వివరాలను రికార్డుల రూపంలో నమోదు చేయడంతో పాటు గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి పారిశుధ్య సమస్యను పరిష్కరించాలన్నారు. సమయ పాలన పాటించాలని అధికారులకు, కార్యాలయ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాష్ రావు, ఇన్చార్జి ఎంపీఓ చింతమల చలపతి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.