వాన కాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం
కార్యాచరణ రూపొందించింది. ఈ సీజన్లో 4లక్షల టన్నుల ధాన్య సేకరణను లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ధాన్యం రవాణాకు వాహనాలను రెడీ చేస్తున్నది. అక్టోబర్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 4,59,850 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2,85,000 ఎకరాల్లో వరి, 1,35,000 ఎకరాల్లో పత్తి, 8,500 ఎకరాల్లో పప్పు గింజలు, 200 ఎకరాల్లో మిల్లెట్స్, 150 ఎకరాల్లో నూనె గింజలు, 21వేల ఎకరాల్లో ఇతర పంటలను పేర్కొంది. జిల్లావ్యాప్తంగా 2.76 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. కొన్ని రోజుల్లో కోతలు కూడా షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 323 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో 90 ఐకేపీ, 220 పీఏసీఎస్‌లు, 13 ఇతర కేంద్రాలను ప్రారంభించనున్నారు.
కోటి గన్నీ బ్యాగులు అవసరం..
ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దకాలంటే పలు సూచనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,320, కామన్ గ్రేడ్ రకానికి రూ.2,300 మద్దతు ధర కల్పించనున్నారు. సన్న ధాన్యం కింటాకు రూ.2,820 చెల్లించనున్నారు. జిల్లాలో మొత్తం కోటి గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. ప్రస్తుతం 5,79,542 బ్యాగులు అందుబాటులో ఉండగా, ఇంకా 94,20,458 బ్యాగులు రావాల్సి ఉంది. 4,845 టార్పాలిన్లు, తూకం వేసే పరికరాలు, తేమను నిర్ధారించే మీటర్లు అందుబాటులో ఉంచనున్నారు. మిల్లుల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు.
6లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి..
జిల్లాలో 6,16,507 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 5,46,143 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 70,364 మెట్రిక్ టన్నులు సన్నాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోళ్లు చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇందులో 3,67,636 మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు కొనాలని అధికారులు అనుకుంటున్నారు. అక్టోబర్‌లో 12,234 ఎంటీలు, నవంబర్‌లో 2,73,766, డిసెంబర్లో 1,140,00 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో 51 మిల్లులు ఉండగా, 10 రా, 41 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. వాటిల్లో 3,35,500 టన్నులు ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉంది. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఉండవు. కాగా, గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 22శాతం, రబీకి సంబంధించి 62శాతం సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది.
అక్టోబర్ రెండో వారం నుంచి కొనుగోళ్లు..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సమీక్షలు
నిర్వహిస్తున్నాం. ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. ఇందులో 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 323 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– జగదీశ్, పౌర సరఫరాల శాఖ డీఎం