నీలగిరి, మే 05 : సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసి సహజ మరణంగా చిత్రికరించేందుకు ప్రయత్నించిన మహిళ, అమెకు సహకరించిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ నగర్ కాలనీలో ఆవుల మల్లయ్య, లక్ష్మమ్మతో గత 25 సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో మల్లయ్య వేరుగా మరో మహిళతో ఉంటున్నాడు. దీంతో మల్లయ్య, లక్ష్మమ్మ మధ్య గొడవలు మరింత పెద్దవి అయ్యాయి. ఈనేపధ్యంలో గల నెల ఏప్రిల్ 20 మల్లయ్య తన గడికి మరో మహిళను తీసుకురావడంతో లక్ష్మమ్మ అక్కడికి వెళ్లి గొడవకు దిగినట్లు తెలిపారు.
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం పెరగడంతో ఆగ్రహానికి లోనైన లక్ష్మమ్మ, తన కుమారుడు ఆవుల ప్రసాద్‌ను పిలిపించి మల్లయ్యను హత్య చేయాలని నిర్ణయించింది. అదే రోజు రాత్రి సుమారు 3 గంటల సమయంలో ప్రసాద్ కర్రతో మల్లయ్య తలపై బలంగా దాడి చేశాడని, అనంతరం అతని చేతులు, కాళ్లు పట్టుకుని ఉండగా లక్ష్మమ్మ టవల్ తో మెడ చుట్టి బిగించి గొంతు నులిమివేయడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని మంచంపై ఉంచి, అది సహజ మరణంలా కనిపించేలా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మ మల్లయ్య సహజ మరణం జరిగింది అని చెబుతూ పొరుగువారిని పిలిచి ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది.
అయితే మృతుడి బంధువులు మృతదేహాన్ని పరిశీలించగా తలపై గాయాలు, మెడపై గొంతు నులిమిన గుర్తులు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తమ్ముడు ఆవుల లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు రాబట్టినట్లు తెలిపారు. నిందితులు మంగళవారం రోజున అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన టవల్, కర్ర మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి మర్డర్ కేసును చేదించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్సీ కొలను శివరాంరెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో టూటౌన్ ఎస్ఐ యార్రా సైదులు, సిబ్బంది విజయ తదితరులు ఉన్నారు.