హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్లో ఈ ఏడాది 80శాతం సీట్లు మాత్రమే నిండాయి. ఏకంగా 20 శాతం సీట్లు ఖాళీగా మిగిలాయి. మొత్తంగా 176 కాలేజీల్లో 94,156 సీట్లుండగా, మూడు విడుతల కౌన్సెలింగ్ తర్వాత 75, 054 (80శాతం) సీట్లు మాత్రమే నిండాయి. 19, 102 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎప్సెట్ తుది విడుత సీట్లను మంగళవారం కేటాయించారు. తుది విడుతలో కొత్తగా 3,281 మంది సీట్లు దక్కించుకున్నారు.
19,811 మంది స్లైడింగ్లో ఒక కాలేజీ నుం చి మరో కాలేజీలో సీటు మార్చుకున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,771 మంది సీట్లు దక్కించుకున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సీట్లు పొందిన వారు ఈ నెల 7వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అయితే సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ బ్రాంచీల్లోను మొత్తం సీట్లు నిండలేదు. ఈ విభాగంలో 82శాతం సీట్లు నిండగా 18 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి.