కోదాడ, జనవరి 17 : ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కోదాడ ఎంవీఐ ఎస్కే జిలాని అన్నారు. శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, మొబైల్ వినియోగించకుండా వాహనాలు నడపాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు. మద్యం సేవించకుండా, వేగాన్ని నియంత్రణ చేసుకుని వాహనాలు నడపాలన్నారు. హెల్మెట్ తోనే భద్రత.. సెల్ఫోన్ డ్రైవింగ్ వద్దని నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.ఆర్ చరణ్, రవాణా శాఖ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.