రామగిరి, డిసెంబర్ 18: మారుతున్న నేటి ఆధునిక కాలంలో ఎవరు ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇటీవల కాలంలో చిన్న వయసులోనే అనేకమంది కార్డియాక్ అరెస్ట్‌కు గురవుతుండటం ఆందోళన కలిగస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 23 ఏండ్ల వయసున్న గృహిణి, పోలీసు ఈవెంట్స్‌కు సిద్ధమవుతున్న యువకుడు గుండె ఆగడంతో మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం నల్లగొండలో మొబైల్ షాపు నిర్వహించే యువకుడు మృత్యువాతపడటంలో ఆయా కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.
గుండె జబ్బులు అంటే పూర్వం 50 ఏండ్లు పైబడిన వారిలో కనిపించేవి. ఇప్పుడు ఏవయసులో ఉన్న వారిలోనైనా కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యపోయే విషయం. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇటీవల జరిగిన సంఘటనలు..
నల్లగొండలో యువకుడు
రామగిరి, డిసెంబర్ 18: .నల్లగొండ పట్టణంలో ఆదివారం గుండెపోటుతో బొల్లోజు నరేశ్(23) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు, మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్ పట్టణంలోని ఎన్జీ కళాశాల సమీపంలో శ్రీ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉద యం ఇంట్లో ఉండగా ఒక్క సారిగా చాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు.
కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. మిత్రులు, సన్నిహితులు కన్నీరుమున్నీర య్యారు.