ఇద్దరు రాష్ట్ర కీలక మంత్రులు, ప్రభుత్వ విప్, ఎంపీ, ఎమ్మెల్సీ, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు. అంతా అప్పుడే ఏదో జరిగిపోయినట్లు హడావుడి.. రిజర్వాయర్లు, కాల్వలు కట్టినంత డ్రామా.. ఇదీ భువనగిరి పార్లమెంట్ స్థాయి సమీక్ష. కానీ ఒక్క పైసా విడుదల చేయలేదు. ఒక్క జీవో రిలీజ్ కాలేదు. పరిపాలనా అనుమతులు కూడా పత్తాలేవు. అన్నీ ఉత్తుత్తి ముచ్చట్లు.. నోటి మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఒరిగిందేమీ లేదు. సమీక్ష జరిగి పది రోజులైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నీటిపారుదల పురోగతి పనులపై ఆగస్టు 30న భువనగిరిలో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్, హెలిప్యాడ్ ఉన్నప్పటికీ వృథా ఖర్చుతో న్యూడైమెన్షన్ స్కూల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనికి రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. వీరితోపాటు రైతులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. పార్లమెంట్ పరిధిలో నీటిపారుదల శాఖ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ పరిధిలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లతోపాటు బునాదిగాని, ధర్మారెడ్డి పల్లి, పిలాయిపల్లి కాల్వల గురించి ప్రస్తావించారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఆయా ప్రాజెక్ట్‌లపై ప్రతిపాదనలు పంపించారు. కానీ ఏ ఒక్కటీ అడుగు ముందుకు పడలేదు. అందరి నమ్మకాలన్నీ వమ్ము అయ్యాయి.
కాళేశ్వరం -16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీలతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మించారు. దీనిలో భాగంగా భువనగిరి మండలంలో తిమ్మాపూర్, యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండా ముంపునకు గురవుతున్నాయి. భువనగిరిలో జరిగే సమీక్షకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలియండంతో బస్వాపూర్ రిజర్వాయర్‌కు డబ్బులు వస్తాయని అంతా భావించారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్ట్‌కు నిధులు ప్రకటించడంతోపాటు, ఒకటి రెండు రోజుల్లో డబ్బులు వస్తాయని భూనిర్వాసితులు, అధికారులు ఆశలు పెట్టుకున్నారు. కానీ సమీక్ష సమావేశంలో కనీసం బస్వాపూర్ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఇప్పటికీ పది రోజులు అవుతున్నా పైసా విదిల్చలేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సుమారు రూ. 500 కోట్లు కావాలి. ఇందులో రూ. 200 కోట్లు భూనిర్వాసితులు, మిగతావి అభివృద్ధి పనులకు అవసరం పడనున్నాయి. భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు చెల్లిస్తే తిమ్మాపూర్ గ్రామాన్ని ఖాళీ చేయనున్నారు. దీంతో రిజర్వాయర్‌ను నీటితో నింపే అవకాశం ఉంటుంది. దీని ద్వారా 2లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వలను అప్పుడే ఏదో చేసినంత బిల్డప్ సదరు సమావేశాల్లో కనిపించింది. సమీక్ష కంటే ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు అనాజిపురం వద్ద ఉన్న బునాదిగాని కాల్వను సైతం పరిశీలించారు. బునాదిగానితోపాటు ధర్మారెడ్డి పల్లి, పిలాయిపల్లి కాల్వలకు వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. కానీ పది రోజులైనా నిధులు దేవుడెరుగు కనీసం మంజూరు కూడా ఇవ్వలేదు. బునాదిగాని కాల్వకు రూ. 269.46 కోట్లు, పిలాయిపల్లికి రూ. 86.22 కోట్లు, ధర్మారెడ్డి పల్లికి రూ. 123.98 కోట్లు అవసరం పడతాయని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కల్వర్టులు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఆధునికీకరణతోపాటు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మూడు కాల్వలను ఆధునికరిస్తే మూసీ వృథా జలాలను ఉపయోగించుకోవచ్చు.
ఆలేరు నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించేందుకు తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ముంపు సమస్య, భూసేకరణ అధికంగా ఉండటంతో1.5 టీఎంసీలకు తగ్గిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలేరుతోపాటు సిద్ధిపేట జిల్లాలో 63వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. దీని కోసం 1,144 ఎకరాలు భూసేకరణ, రూ.575.57 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసి ప్రతిపాదనలు పంపించారు. గంధమల్ల రిజర్వాయర్ అప్పుడే కట్టినట్లు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు కూడా చెప్పగా.. ఈ రిజర్వాయర్‌కు ఇప్పటి వరకు అసలు అనుమతులే రాలేదు. ఎలాంటి నిధులు మంజూరు కాలేదు.
గంధమల్ల రిజర్వాయర్‌తోపాటు బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సర్కారు వద్ద పరిశీలన దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి ఎలాంటి మంజూరు అనుమతులు రాలేదు. బస్వాపూర్ రిజర్వాయర్‌కు కూడా నిధులు విడుదల కాలేదు. త్వరలోనే వస్తాయని భావిస్తున్నాం.