నీలగిరి, జూలై 24 : ఈ నెల 26 నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్, వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో బుధవారం వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెప్మా సిబ్బంది, వైద్యారోగ్యశాఖ సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి వారికి గురువారం శిక్షణ ఇచ్చి శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వేను చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని, ఎవరికైనా జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స అందించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.
తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలను గుర్తించి అరికట్టాలని, ట్రాన్స్ఫార్మర్లకు తక్షణమే కంచెలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇండ్లపైన దగ్గరగా వెళ్లే విద్యుత్ వైర్ల నుంచి ప్రమాదం జరుగకుండా పైపులాంటివి తొడించాలన్నారు. వనమహోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, డీఎంహెచ్ఓ కళ్యాణచక్రవర్తి, మున్సిపల్ కమిషనర్లు, డీపీఎం మేనేజర్లు పాల్గొన్నారు.