హాలియా, డిసెంబర్ 12 ; పరుగెడుతున్నా నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీటికి కరువు ఉండేది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన నేలలు నెర్రెలు బారేవి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల తవ్వకం దశాబ్దాలపాటు నత్తనడకన సాగడంతో జిల్లా ప్రజలు, ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ జనం తాగు, సాగునీటికి అరిగోస పడ్డారు. 2014లో స్వరాష్ట్రం సిద్ధించాక ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్, పంప్ హౌస్ నిర్మాణానికి సుమారు రూ.93 కోట్లు వెచ్చించి రెండేండ్లలోనే పూర్తి చేయించారు. దాంతో గత ఆరేండ్లుగా నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాంతో నేడు పసిడి పంటలు పండుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా సముద్రం పాలవుతున్న వందలాది టీఎంసీల కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించి సేద్యంలోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో 1997లో వరద కాల్వ నిర్మాణం చేపట్టారు. నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీరు ఉంటే గ్రావిటీ ద్వారా, అంతకంటే తక్కువగా ఉంటే పంపింగ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో ఉన్న 80 వేల ఎకరాలకు సాగునీరు, వేలాది మందికి తాగునీరు అందించే ఉద్దేశంతో వరద కాల్వ నిర్మాణం చేపట్టారు. 175 కోట్లతో ప్రారంభమైన వరద కాల్వ పంప్ హౌస్ నిర్మాణం 2009 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ, గత టీడీపీ, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో వరద కాల్వ, పంప్ హౌస్ నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పిన చందంగా సాగాయి. దాంతో వాటి నిర్మాణ వ్యయం పెరిగిందే తప్ప రైతులకు మేలు జరిగింది లేదు. ప్యాకేజీ 81 కింద రూ.70.85 కోట్లు ఖర్చు చేయగా, 110 ప్యాకేజీ కింద 65 కోట్లు ఖర్చు చేశారు.
త్వరితగతిన పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్దే..
నత్తనడకన సాగిన ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని టెయిలెండ్ భూములకు సాగునీరు అందించాలనే సంకల్పంతో పంప్ హౌస్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. దివంతగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పట్టుదల, నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నూతన ధరల ప్రకారం పంప్‌హౌస్ నిర్మాణ వ్యయాన్ని రూ.148 కోట్లకు పెంచడంతోపాటు సకాలంలో నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో 2016లో పనులు పూర్తవగా నవంబర్ 9, 2016న అప్పటి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
93 కోట్లు విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..
2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వరద కాల్వ పంప్‌హౌస్ నిర్మాణం కోసం 93,04,70,936 రూపాయలు విడుదల చేసింది. అందులో పంప్ హౌస్ నిర్మాణం కోసం 54,03,43,589 రూపాయలు, 110 ప్యాకేజీ కింద కాల్వ నిర్మాణం కోసం 39,01,27,347 రూపాయలు కేటాయించింది. పంప్‌హౌస్ నిర్మాణానికి రూ.148 కోట్లు, వరద కాల్వ కోసం 135.85 కోట్లు ఖర్చు అయ్యాయి.
80 వేల ఎకరాలకు సాగునీరు ..
నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లోని ఏడు మండలాలైన పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, కనగల్, మాడ్గులపల్లి, వేములపల్లి ఎన్ఎస్పీ కింద స్థిరీకరించిన 30 వేల ఎకరాలు కలిపి మొత్తం 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. పెద్దవూర మండలంలో 9,191 ఎకరాలు, అనుముల మండలంలో 12,094 ఎకరాలు, నిడమనూరు మండలంలో 11,302 ఎకరాలు, త్రిపురారం మండలంలో 4,605 ఎకరాలు సేద్యంలోకి వచ్చాయి. అలాగే ఆయా నియోజకవర్గాల్లోని సుమారు 27 చెరువులను వరద కాల్వతో అనుసంధానం చేశారు. దాంతో భూగర్భజలాలు పెరిగి తాగు, సాగునీటి కొరత తీరింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ మేలును మరువలేం
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే వరద కాల్వకు సాగునీరు వచ్చింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది నాగార్జునసాగర్ జలాశయంలోకి నీరు రాకపోవడంతో సాగునీరు రాలేదు. కానీ, గత ఆరేండ్లుగా వరద కాల్వ కింద వరి సాగు చేస్తున్నా. వరద కాల్వకు నీటి విడుదల చేయడంతో భూగర్భజలాలు పెరిగాయి. వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ఈ ప్రాంత రైతులమంతా మాజీ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-కుంటిగొర్ల జనార్దన్, రైతు, కోసలమర్రి, అనుముల మండలం
భూగర్భజలాలు భారీగా పెరిగినయ్
అసంపూర్తిగా ఉన్న వరద కాల్వ పనులను పూర్తిచేయించడంతోపాటు ఆరేండ్లుగా కాల్వకు సాగునీటిని విడుదల చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. వరద కాల్వకు సాగునీటిని విడుదల చేయడంతో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. వరదకాల్వతోపాటు బోర్ల కింద రైతులు వరి, పండ్లతోటలు సాగు చేస్తున్నారు. గతంలో వరద కాల్వకు నీళ్లు రానప్పుడు భూములన్నీ బీళ్లుగా ఉండేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.
-కున్రెడ్డి మధుసూదన్‌రెడ్డి, రైతు, బట్టుగూడెం, పెద్దవూర మండలం