యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ)/ నల్లగొండ, జూన్ 21: రోహిణి కార్తెలో ముందస్తు వర్షాలతో మురిపించిన వరణుడు మృగశిర కార్తె ముగిసి ఆరుద్ర కార్తెలోకి ప్రవేశిస్తున్నా కరుణించకపోవటంతో ఈ ఏడాది ఎవుసం అదునుదాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. జిల్లాలో వారాలు గడుస్తున్నా చినుకు జాడ లేకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఐదు మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం రికార్డయింది. మరోవైపు భూగర్భజలాలు కూడా పడిపోయాయి. చెరువుల్లో చుక్కనీరు లేదు. దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశగా మొగులు దిక్కు చూస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి మూడు జిల్లాలోనూ లోటు వర్షపాతమే నమోదైంది. సూర్యాపేటలో 76 శాతంతో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నల్లగొండలో 34.2 శాతం నమోదైంది. ఈ సీజన్లో ఇక్కడ ఇప్పటి దాక 82.0 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 48.8 సెంటీ మీటర్లు మాత్రమే పడింది. దీంతో 34.2 సెంటీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 33 మండలాలకు గాను చిట్యాల, దామరచర్ల, కొండమల్లే పల్లి, చందంపేట, గట్టుప్పల్ మండలాల్లో సాదారణ వర్షపాతం నమోదు కాగా చింతపల్లి, దేవరకొండ, మర్రిగూడ మండలాల్లో కాస్త ఎక్కువగా పడినప్పటికీ మిగిలిన 25 మండలాల్లో కనీస వర్షం కూడా పడకపోవటంతో రైతులు వరణుడి జాడకోసం చూస్తున్నారు.
ఈ సీజన్లో 11.60లక్షల ఎకరాల్లో ఆయా పంటల సాగుచేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో ప్రధానంగా 5, 47, 735 ఎకరాల్లో పత్తి, 5, 25, 350 ఎకరాల్లో వరి సాగు చేయనుండగా మిగిలిన ఎకరాలోల్లో కందులు, పెసర, జొన్న, మొక్కజొన్న సాగు చేయనున్నా రు. అయితే ఇప్పటివరకు అందులో 30వేల ఎకరాలో పత్తి సాగు కాగా 22500 ఎకరాల్లో వరినారు పోశారు. ఎడమకాల్వతో పాటు ఏఎమ్మార్పీకి నీటి విడుదల లేకపోవటంతో పాటు రోహిణిలో కురిసిన కొద్దిపాటి వర్షాలకే విత్తిన విత్తనాలు మెలకెత్తకపోవటంతో ఆ మొలకల కోసం రైతన్న ఆవేదన అంతా ఇంతాకాదు.
యాదాద్రిలో 31 శాతం తక్కువగా నమోదైంది. సూర్యాపేటలోని 23 మండలాలు అత్యంత లోటు వర్షపాతం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉండగా, ఆరు మండలాలు మినహా మిగతా చోట్ల లోటు వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో యాదగిరిగుట్ట మండలంలో 84 శాతం, అడ్డగూడూరు, భువనగిరిలో 80 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బీబీనగర్‌లో 68 శాతం, గుండాలలో 66 శాతం, మోత్కూరులో 44 శాతం లోటు రికార్డయింది. చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో మాత్రం ఆశాజనకంగానే వర్షాలు పడ్డాయి.
యాదాద్రి జిల్లాలో సుమారు 900 పైగా చెరువులు ఉన్నాయి. వీటిల్లో దాదాపు అన్నీ ఎండిపోయే దశకు చేరుకున్నాయి. అనేక చోట్ల చుక్క నీరు కూడా లేదు. సగటున జిల్లాలోని చెరువుల్లో 25 శాతం నీళ్లు కూడా లేవు. గత యాసంగి సీజన్ సమయంలోనే చెరువుల్లో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ ఇంకిపోతున్నాయి. దీంతో బోర్లు, బావులు సైతం ఎండిపోయాయి. అనేక చోట్ల రైతులు లక్షల వెచ్చించి.. కొత్త బోర్లు వేస్తున్నా నీళ్లు పడటం లేదు.
ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,40,500 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇం దులో అత్యధికంగా 2,95,000 ఎకరాల్లో వరి వేయనున్నట్లు భావిస్తున్నది. ఆ తర్వాత 1,15,000 ఎకరాల్లో పత్తి వేసి అవకాశం ఉందని లెక్కలు వేసింది. ఇంత వరకు బాగానే వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో సీజన్ ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఎరువు, విత్తనాలు కొనుగోలు చేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వర్షాలు ఆలస్యమై విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల వరి పోసినా చేతికి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాధారిత పంట అయిన పత్తి ఎదుగుదల లేదు. కొన్ని చోట్ల మొల్కలు వచ్చినా చేను ఎదుగుదల అనుకున్న స్థాయిలో కనిపించడంలేదు. మొల్కలు వచ్చిన చోట తేమ శాతం లేక ఆరిపోతున్నాయి. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల పెట్టుబడులు భూమిలో పోసి వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజులపాటు పరిస్థితి ఉంటే మరిన్ని ఇబ్బందులు తప్పవు.