జూనియర్ పంచాయతీ సెక్రటరీల క్రమబద్ధీకరణ సూర్యాపేట జిల్లాలో ప్రహసనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేండ్ల సర్వీసు పూర్తయిన వారిని క్రమబద్ధీకరించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇతర జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలుగా జేపీఎస్‌లను క్రమబద్ధీకరించారు. ఇటీవల కార్యాలయ ఉద్యోగులు, దళారులు కలిసి జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తామని, అందుకు రెండు నెలల వేతనం ఇవ్వాలంటూ జేపీఎస్‌ల వద్ద బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడాది క్రితమే నాలుగేండ్లు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లు సుమారు 40 మంది ఫైళ్లు పట్టుకొని, ఆయా శాఖల చుట్టూ తిరుగుతున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు.
సూర్యాపేట, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి పేరిట నెలనెలా ప్రతి పంచాయతీకి జనాభాను బట్టి రూ.15 నుంచి 35 లక్షల రూపాయలు విడుదల చేయడంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి. నిధుల విడుదలతోపాటు పంచాయతీలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ సెక్రటరీలను నియమించి వారికే పూర్తి బాధ్యతలు అప్పగించారు. 2018లో రాత పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.15వేల వేతనంతో కూడిన 9వేల జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు నోటిఫికేషన్ ఇచ్చి ఐదేండ్లకు క్రమబద్ధీకరణ చేపట్టేలా నియామకాలు చేపట్టింది.
అయితే ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారికి వేతనం సరిపోవడం లేదని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2023లో ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తూ నెలసరి వేతనాన్ని ఏకంగా రూ.28,700లకు పెంచుతూ అదే జీవో ద్వారా క్రమబద్ధీకరణను కూడా ఐదేండ్ల నుంచి నాలుగేండ్లకు కుదించారు. 2018 నాటికి జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు గానూ దాదాపు వంద మంది మాత్రమే పంచాయతీ సెక్రటరీలు ఉండగా 375 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ ల రిక్రూట్మెంట్ జరిగింది. 2023 జీవోతో ఆ ఏడాది చివరి నాటికి దాదాపు 280 నుంచి 300 మందికి రెగ్యులరైజ్ కాగా కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తరువాత మరో 20 నుంచి 30 మంది వరకు క్రమబద్ధీకరించారు. ఇంకా జిల్లా లో 40 మంది జేపీఎస్‌లు ఏడాది కాలంగా క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నారు.
ఏడాది క్రితమే నాలుగేండ్లు పూర్తి చేసుకు న్న 40 మంది జేపీఎస్‌లను ఇప్పటివరకు క్రమబద్ధీకరించకపోవడంపై అనేక అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. జీఓ ప్రకారం నాలుగేండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తరువాత ఆటోమేటిక్‌గా రెగ్యులర్ అయ్యే లా రిక్రూట్మెంట్ సమయంలోనే నిబంధన ఉంది. అయితే నల్లగొం డ, యాదాద్రితోపాటు ఇతర జిల్లాల్లో మాత్రం చకచకా క్రమబద్ధీకరణ పూర్తి కాగా సూర్యాపేటలో మాత్రమే కాలేదు. ఇటీవల ఒకరిద్దరు కార్యాలయ ఉద్యోగులు ఉన్నతాధికారుల పేరు చెబుతూ రెం డు నెలల వేతనం ఇస్తే వెంటనే పనైపోతుందంటూ బేరమాడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే కొంతమంది నుంచి డబ్బులు తీసుకొని క్రమబద్ధీకరణ చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది జేపీఎస్‌లు పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి యాదయ్యను జాప్యానికి గల కారణాలతో పాటు ఇటీవల కొత్తగా ఏమైనా క్రమబద్ధీకరణ జరిగిందా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేద ని కార్యాలయం ఉద్యోగి ద్వా రా గత శుక్రవారం వాట్సా ప్ మెసేజ్ పెట్టించారు. కొ న్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు