చండూరు, మే 13 : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరుతూ మే 20న కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు జెర్రిపోతుల ధనుంజయ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మె గోడ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు చేస్తూ తమ రక్తాన్ని చెమటగా మార్చి సరుకుల రవాణాలో కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నట్లు చెప్పారు.
ఇంత చాకిరి చేస్తున్నా హమాలీలకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధ హక్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. కార్మిక వర్గానికి స్వాతంత్ర్యానికి ముందు తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తమకున్న మందబలంతో ఆమోదింప చేస్తుందని దుయ్యబట్టారు.
ఈ కోడ్స్ అమలైతే కార్మిక హక్కులన్నీ హరించిపోతాయని, రెండు సంవత్సరాలకు ఒకసారి యజమానులతో భేరసారాలు ఆడి హమాలీల కూలి రేట్లు పెంచుకునే సాంప్రదాయం లేకుండా పోతుందన్నారు. అలాగే సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితంగా సమ్మె చేసే హక్కు, ఉమ్మడి భేరసారాల హక్కులు లేకుండా పోతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకుడు చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం నాయకులు బల్లెం స్వామి, ఈరటి వెంకటయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సాయం కృష్ణయ్య, శేఖర్, నాగేశ్, నాగరాజు, చిరంజీవి, ఆకాశ్, లింగస్వామి, అశోక్ పాల్గొన్నారు.