రామగిరి, నవంబర్ 27 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించాల్సిన పలు సెమిస్టర్స్ పరీక్షలు ఈ నెల 28నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు కళాశాలల నిరవధిక బంద్ పాటించడంతో యూనివర్సిటీ పలు పరీక్షలను వాయిదా వేసిన విషయం విదితమే. ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చాయి. దాంతో వర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో పరీక్షలకు సిద్ధం చేశారు. నవంబర్‌లో జరుగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేసి డిసెంబర్లో నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే యూనివర్సిటీ పరీక్ష విభాగం వెల్లడించింది. 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, 5వ సెమిస్టర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నాయి. మారిన పరీక్షల కాలనిర్ణయ పట్టికను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతోపాటు కళాశాలలకు పంపించారు. ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించాలని ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు రెండు విడుతలుగా కళాశాలలు నిరవధిక బంద్ చేపట్టారు. దీంతో విద్యార్థు లు నష్టపోవాల్సి వచ్చిందని పలువురు విద్యావేత్తలు విమర్శలు చేస్తున్నారు. సకాలంలో ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఒకరోజు, మరో రోజు మధ్యాహ్నం 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి జి.ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ అప్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్(టీపీడీఎంఏ) కళాశాలల నిరవధిక బంద్ పాటించాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యాం. మాట మేరకు అధికారులు, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో రాష్ట్ర అసోసియేషన్ తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం. విద్యార్థులు నష్టపోయిన తరగతులను అవసరమైతే అదనపు తరగతుల నిర్వహణతోపాటు రెండో శనివారం, ఆదివారం కూడా కళాశాలల నిర్వహిస్తాం. ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సన అవసరం లేదు.
నేటి నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, వాటాప్, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని ఎంజీయూ సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. పరీక్షలు రద్దు అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తమని చెప్పారు. మారిన పరీక్షల షెడ్యూల్ యూనివర్సిటీ వెబ్ సైట్లో ఉందని, అందరూ సకాలంలో పరీక్షలకు హాజరుకావాలని కోరారు.