సూర్యాపేట టౌన్, అక్టోబర్ 28 : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించగా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడడానికి దోహద పడుతాయన్నారు. డ్రగ్స్, గంజాయి చాలా ప్రమాదకరమైనవని, యువత వీటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌తో మానసిక ఒత్తిడిని దూరమవుతారు అనేది ఒట్టి అపోహ అని, క్రమంగా ఆరోగ్యం, భవిష్యత్ దెబ్బతింటాయని హెచ్చరించారు.
మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. అనంతరం 2కే రన్లో మొదటి బహుమతి జి.నవీన్, సెకండ్ విన్నర్ బి.తరుణ్ (ప్రతిభ జూనియర్ కళాశాల), మూడో బహుమతి సాధించిన ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ సతీష్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ నరసింహచారి, సీఐలు రాజశేఖర్, సురేందర్‌రెడ్డి, ఆర్ ఐ నారాయణరాజు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, యువత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.