తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 28,909 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుండగా, 10:15 గంటల్లోపు అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణకు మూడు జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రామగిరి, జూన్ 10 : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నది. ఉదయం 10:15 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు బంద్ చేస్తారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రంలోని అనుమతించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు.
నల్లగొండలో 51 కేంద్రాలు
ఇందుకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 16,095 మంది అభ్యర్థులు హాజరు కానుండగా.. జిల్లా కేంద్రంలో 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్స్, లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నంబర్ 18004251442 అందుబాటులో ఉంచారు. పరీక్షకు సంబంధించి ఏమైన సమస్యలుంటే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
సూర్యాపేటలో 32 పరీక్ష కేంద్రాలు
సూర్యాపేట : గ్రూప్-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 9,170 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారని, వీరి కోసం 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూం నుంచి పరీక్ష కేంద్రాల వరకు బందో బస్తుతో పేపర్లను తరలిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఎస్పీ నాగభూషనం పాల్గొన్నారు.
యాదాద్రిలో 12 కేంద్రాలు
భువనగిరి కలెక్టరేట్ : గ్రూప్-1 పరీక్షలకు యాదాద్రి, భువనగిరి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల పర్యవేక్షణ అధికారి డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే హాజరు కావాలని, ఆ తర్వాత హాల్లోకి అనుమతించమని పేర్కొన్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ సందేహాలను వృత్తి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రి నంబర్ 91211 47135ను అందుబాటులో ఉంచారు. అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు.