ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన దామరచర్లలో పారిశ్రామిక రంగం పరుగులు తీస్తున్నది. సహజ వనరులైన నీరు, సున్నపురాయి పుష్కలంగా ఉండడం, సరిపడా భూమి అనుకూలంగా దొరుకడం, రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుండడంతో ఇక్కడ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. సిమెంట్ పరిశ్రమకు పేరుగాంచిన కృష్ణపట్టెలో పలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలూ వెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు, రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో వ్యాపారాలు నడుపలేకపోతున్న వాళ్లు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ముగ్గు మిల్లులు ఏర్పాటు చేశారు. తాజాగా కృష్ణాగోదావరి స్టీల్ ప్లాంట్‌ను రూ.300కోట్లతో పునర్నిర్మిస్తున్నారు. తద్వారా స్థానికులకూ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆంధ్రాలో కోతలే గాక, కరెంటు బిల్లులూ అధికమేనని అక్కడి వ్యాపారులు చెప్తున్నారు.
దామరచర్ల, అక్టోబర్ 17 : తెలంగాణ.. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు మంచి అనుకూలం. ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యాపారవేత్తలు మండలంలోని కృష్ణానది సరిహద్దు ప్రాంతంలో పలు చిన్ని, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రశాంత వాతావరణం, సుపరిపాలన, నిరంతర విద్యుత్, ప్రోత్సాహకాలు, రాయితీల వంటి చర్యలు నూతన పరిశ్రమలకు బాటలు వేస్తున్నాయి. తెలంగాణ-అంధ్రా సరిహద్దు మండలం దామరచర్లలో ఆంధ్రాకు చెందిన పలువురు వ్యాపారులు చిన్న తరహా పరిశ్రమలైన ముగ్గు మిల్లులు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటుగా నిలిచిపోయిన కృష్ణా గోదావరి స్టీల్ ప్లాంట్ కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కొనుగోలు చేసి పునర్నిర్మాణం చేస్తున్నారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా..
ఆంధ్రాలో నడుపుతున్న మిల్లులకు ప్రభుత్వం రోజుకు 4 నాలుగు గంటలు విడుతల వారీగా కోత విధిస్తున్నది. ఈ సమయం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నదని, దాంతో వ్యాపారానికి కొంత ఇబ్బంది కలుగుతుందని పలువురు వ్యాపారవేత్తలు తెలుపుతున్నారు. తెలంగాణాలో ఎలాంటి కోతలు లేకుండా నిరంతరాయంగా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తుండడంతో మిల్లులు ఆగకుండా నడుస్తున్నాయి. అక్కడ జరిగే నష్టాన్ని ఇక్కడ పూడ్చుకుంటున్నారు. తెలంగాణ కంటె ఆంధ్రాలో కరెంట్ చార్జీలు అధికం కావడంతో బిల్లులు సైతం ఆంధ్రాలో ఎక్కువగా వస్తున్నాయి. నెలకు సుమారు రూ.10 వేలు ఆంధ్రాలో ఎక్కువగా వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. తెలంగాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిల్లులు నడుపుతున్నారు. దాంతో మరికొన్ని మిల్లులను కూడా కొనుగోలు చేస్తూ వ్యాపారాలను పెంచుకుంటున్నారు. కృష్ణానది ఆవల ఆంధ్రా, ఇవతల తెలంగాణ కావడంతో వ్యాపారాలు చూపుకునేందుకు మంచి అనుకూలంగా ఉన్నది.
వ్యాపారానికి అనుకూలంగా తెలంగాణ..
ముగ్గు మిల్లులకు పేరుగాంచిన ఆంధ్రాలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండల కేంద్రంలో అధికంగా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రాతో పాటుగా తెలంగాణాలోని దామరచర్ల మండలంలో కూడా వీరు మిల్లులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మండలంలోని సుమారు 20 వరకు ముగ్గు మిల్లులు ఉండగా వీటిలో సుమారు 10 ముగ్గు మిల్లులు ఆంధ్రాకు చెందిన వారివే. దామరచర్ల, ఇర్కిగూడెం, వాడపల్లిలో ముగ్గు మిల్లులు ఏర్పాటు చేసుకున్నారు. కావల్సిన ముడిరాయి. కూలీలు, నీటి సదుపాయం, వసతులు అనుకూలంగా ఉన్నాయి. మిల్లుల్లో తయారు అయ్యే చిప్స్, పౌడర్ ఇతర ప్రాంతాలు, రాష్ర్టాలకు తరలిస్తారు. ఇర్కిగూడెం శివారులోని కృష్ణా గోదావరి స్టీల్ ప్లాంట్‌ను ఆంధ్రా ప్రాంతం వారే కొనుగోలు చేసి సుమారు రూ.300 కోట్లతో నూతనంగా పునర్నిర్మాణం చేస్తున్నారు.
తెలంగాణలో ఎలాంటి ఇబ్బందుల్లేవు
తెలంగాణాలో ఏర్పాటు చేసుకున్న మిల్లు మంచిగా నడుస్తుంది. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం నిత్యం 24 గంటలు విద్యుత్తు ఇవ్వడం వల్ల పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతి రోజు మిల్లు ఆగకుండా చిప్స్, పౌడర్ ఉత్పత్తి చేస్తుకుంటున్నాం. ఆంధ్రాలో మాకు మరో మిల్లు ఉంది. అక్కడ కరెంటు కోతలు విధిస్తున్నారు. దాంతో వ్యాపారానికి కొంత ఇబ్బంది వస్తుంది. ఇక్కడ ముడి సరుకు, వర్కర్లు అందుబాటులో ఉన్నారు.
– డి.శ్రీనివాస్‌రావు, మిల్లు వ్యాపారి, దాచేపల్లి