గురువారం 04 మార్చి 2021
Nalgonda - Jan 30, 2021 , 01:42:09

అంశ మారింది!

అంశ మారింది!

  • నెరవేరిన అంశల స్వామి సొంతింటి కల 
  • ఫ్లోరోసిస్‌ బాధితుడికి డబుల్‌ బెడ్రూమ్‌ మంజూరు 
  • నల్లగొండ కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్‌ ఆదేశం
  • గతంలో సెలూన్‌ ఏర్పాటు ద్వారా ఉపాధి
  • కేటీఆర్‌కు రుణపడి ఉంటానంటూ స్వామి సంతోషం
  • చెయ్యని తప్పునకు ఏండ్ల తరబడి శిక్ష 

అనుభవిస్తున్న వేల మందికి ప్రతినిధి అతడు. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో.. పుట్టిన నేల మీద కూడా పాదం మోపలేకపోతున్న నిస్సహాయడతడు. కాళ్లూ చేతులు సహకరించకున్నా పెలుసుబారిన ఎముకలతో ఢిల్లీ దాకా పోరాటం చేశాడు. తమ బతుకులను ఆగం చేసిన ఫ్లోరోసిస్‌రక్కసినుంచిముందుతరాలకైనావిముక్తికల్పించాలంటూ గళం వినిపించాడు. అలాంటి అంశల స్వామి చిరకాల వాంఛ సొంతిల్లు. ఆ కలను మంత్రి కేటీఆర్‌ నెరవేర్చి స్వామి కండ్లల్లో ఆనందం నింపారు. ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి ఉద్యమకారుడు అంశల స్వామికి మంత్రి కేటీఆర్‌ మరోసారి బాసటగా నిలిచారు. స్వామి ఇద్దరు చెల్లెండ్లూ ఫ్లోరైడ్‌ కారణంగానే కన్నుమూశారు. ఇన్నాళ్లూ బాగోగులు చూసుకున్న తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నారు. తనను ఆదుకోవాలంటూ 2019లో స్వామి చేసిన వాట్సాప్‌ మేసేజ్‌ చూసి చలించిన మంత్రి కేటీఆర్‌ అప్పట్లో శివన్నగూడెంలో హెయిర్‌ సెలూన్‌ పెట్టించారు. తాజాగా శుక్రవారం  ప్రగతిభవన్‌లో తనను కలిసిన స్వామి యోగక్షేమాలు తెలుసుకుని డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చారు. మరోవైపు మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కర్నాటి విద్యాసాగర్‌ కూడా ముందుకొచ్చారు. గొప్ప మనసుతో మరోసారి తనకు ఆసరాగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు అంశల స్వామి కృతజ్ఞతలు తెలిపారు. మిషన్‌ భగీరథతో ఫ్లోరోసిస్‌ సమస్య పరిష్కారమవుతున్నందుకు సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. 

మర్రిగూడ, జనవరి 29 : అంశల స్వామి.. జిల్లా ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఫ్లోరైడ్‌ కారణంగా నడుము వంకర్లు తిరిగి నడువలేని స్థితి. తాను అనుభవిస్తున్న బాధ భావితరాలకు రాకూడదన్న ఉద్దేశంతో ఫ్లోరైడ్‌ ఉద్యమంలో పాల్గొన్న స్వామి.. ఎందరో నాయకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో స్వామి కలలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. మిషన్‌ భగీరథ పథకంతో రక్షిత తాగునీరు అందుతుండగా.. గతేడాది మంత్రి కేటీఆర్‌ రూ.4.30లక్షలతో హెయిర్‌ సెలూన్‌ను నిర్మించి స్వామికి బహూకరించారు. ఇప్పటికే డబుల్‌ బెడ్రూం నిర్మించాలని కలెక్టర్‌ను ఆదేశించగా.. తాజాగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా స్వామికి ఇల్లు నిర్మించడానికి ముందుకొచ్చిన టీఆర్‌ఎస్‌ నేత కర్నాటి విద్యాసాగర్‌ను కేటీఆర్‌ అభినందించారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా సూచించారు. తన సొంతింటి కల నెరవేరుతుండడంపై స్వామి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశల స్వామి సొంతిల్లు లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆశ్రయం పొందుతున్నాడు. ఈ క్రమంలో తన సమస్యను గతేడాది వాట్సాప్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విన్నవించాడు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్‌ స్వామికి రూ.4.30లక్షలతో హెయిర్‌ సెలూన్‌ను నిర్మించి అందించారు. డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాల్సిందిగా అప్పటి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ను ఆదేశించారు. 

మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటా... : అంశల స్వామి

కేటీఆర్‌ గారిది పెద్దమనుసు. వాట్సాప్‌ మెస్సేజ్‌కు స్పందించి జీవనోపాధికి హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ కట్టించారు. ఇప్పుడు డబుల్‌బెడ్రూం ఇంటిని కట్టిస్తున్నందుకు ఆయనకు రుణపడి ఉంటాను. నాలుగు నెలల్లో ఇల్లు కట్టించేలా చూడమని విద్యాసాగర్‌ సార్‌కు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్‌భగీరథ పథకం చేపట్టి మా ప్రాంతంలో ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ప్రత్యేక రాష్ట్రంతోనే నీళ్లొస్తాయని మేం కన్న కలలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.

‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'లో భాగంగా.. 

హెయిర్‌ సెలూన్‌ కానుకగా అందడంతో స్వామి స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'లో భాగంగా స్వామికి ఇంటిని నిర్మించేందుకు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌ ముందుకొచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుగట్ల సుభాశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఊరె రమేశ్‌, స్వామితో కలిసి ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. స్వామి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌.. విద్యాసాగర్‌ను అభినందించారు. దగ్గరుండి ఇల్లు పూర్తయ్యే వరకు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని కోరారు.

VIDEOS

logo