ఆదివారం 01 నవంబర్ 2020
Nalgonda - Oct 17, 2020 , 05:52:29

నేటి నుంచి దేవీశరన్నవరాత్రోత్సవాలు

నేటి నుంచి  దేవీశరన్నవరాత్రోత్సవాలు

  •  17 నుంచి 25వరకు వేడుకలు   
  •  కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోనున్న భక్తులు

నల్లగొండ కల్చరల్‌ : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి  ఘనంగా నిర్వహించుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో  కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు జరుపనున్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు నవరాత్రోత్సవాలు జరుగనుండగా దేవాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల్లో శనివారం అమ్మవారు కొలువుదీరి 9 రోజుల పాటు 9 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

అమ్మలగన్న అమ్మ దుర్గామాత నవరాత్రోత్సవాలకు హిందూ ధర్మ సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారికి 9 రోజుల పాటు వివిధ అలంకరణలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నవ నైవేద్యాలను సమర్పిస్తారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు అంతటా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు  భక్తులు మండపాలను సిద్ధం చేశారు. 

అమ్మవారి అవతారాలు.. 

l   ఈ నెల17న శ్రీ స్వర్ణకవచాలంకృత సరస్వతీదేవిగా దుర్గామాత దర్శనం ఇవ్వనున్నారు. చామంతిపూలతో పాటు పసుపు రంగు చీరె, నైవేద్యంగా కొబ్బరి, అరటిపండ్లు, కట్టు పొంగళి అమ్మవారికి సమర్పిస్తారు.

l   18న శ్రీ బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. లేత కదంబ పువ్వులు, ఆకుపచ్చ రంగు చీరెతో పాటు నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు. 

l   19న శ్రీ గాయత్రీదేవిగా అలంకరించనుండగా.. చామంతి పూలు, గచ్చకాయ రంగు చీరెతో పాటు నిమ్మకాయ, రవ్వకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.

l   20న శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇవ్వనుండగా.. మందారపూలు, నారింజ రంగు చీరెతో పాటు గారెలు  నైవేద్యంగా సమర్పిస్తారు.

l   21న శ్రీ సరస్వతీదేవి(మూలానక్షత్రం)గా దర్శనం ఇవ్వనున్నారు. తులసీ దళాలు,  తెలుపు రంగు చీరెతో పాటు  దద్దోజనం, పాయసం నైవేద్యంగా ఇస్తారు. 

l   22న శ్రీ లలితాత్రిపురసుందరీదేవిగా దర్శనం ఇవ్వనుండగా.. గులాబీ పూల, ఎరుపు రంగుచీరెతో అలంకరణ, రవ్వకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.

l   23న శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. పారిజాతలు, గులాబీ, నీలం రంగు చీరెతో పాటు పెరుగు, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.

l   24న శ్రీవిజయదుర్గాదేవి (దుర్గాష్టమి), మహిషాసుర మర్ధినీగా దర్శనం ఇవ్వనున్నారు. కమలం పూలు, ముద్ద ఎరుపు, నీలం  రంగు చీరెతో పాటు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

l   25న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. మందార, గులాబీ రంగు చీరెతో పాటు చక్కెర పాయసం, బూరెలు, పులిహోర నైవేద్యంగా, ప్రసాదంగా సమర్పిస్తారు. 

l   26న అమ్మవారి శోభాయాత్రతో ఉత్సవాలు ముగుస్తాయి.

జిల్లాలో ముస్తాబైన ఆలయాలు..

దేవీ నవరాత్రోత్సవాలకు నల్లగొండలోని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. తులసీనగర్‌లోని భక్తాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని సరస్వతీదేవి ఆలయంతో పాటు పాతబస్తీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత ఆలయాన్ని కూడా ముస్తాబు చేశారు. అదే విధంగా కలెక్టరేట్‌ సమీపంలోని అయ్యప్ప దేవాలయంలో గల జ్ఞాన సరస్వతి ఆలయం, పానగల్‌, హైదరాబాద్‌రోడ్డులోని మర్రిగూడ స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకునే విధంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నార్కట్‌పల్లి, దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడలోని కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారి వేడుకలు వైభవంగా జరుగుతాయి.