రామగిరి/మునుగోడు, జనవరి 9 : ‘అందరూ చదువాలి.. అందరూ ఎదుగాలి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)ఉద్యోగులు జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. విద్యాబోధనతోపాటు విద్యాశాఖ కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుకు నిరంతరం కృషి చేస్తున్న వారికి రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. కేసీఆర్ సర్కారులో మొదటి వారం రోజుల లోపు జీతాలు పొందేవారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక నెల జీతం ఆగగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినా వీరికి జీతాలు మాత్రం రావడం లేదు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న వారు అప్పులు చేసి కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాటా మంజూరులో జాప్యమే కారణమా?
సమగ్ర శిక్షా నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 ః 40 శాతంలో మంజూరు చేయాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వంతు వాటా నిధులను జమ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించడంతోపాటు తన వాటాను ఇంత వరకు జమ చేయక పోవడంతోనే సమస్య వచ్చిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతున్నది.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించాలని, రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్లతో గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజులకుపైగా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2,192 మంది ఉద్యోగులు…
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్షలో 2,192 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి డీఈఓ కార్యాలయాల్లో 31 మంది, మండల మానవ వనరుల కేంద్రాల్లో ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు 64, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 65, మెసెంజర్లు 65, భవిత సెంటర్లలో ఐఈఆర్పీలు 103, కేర్గివర్లు 63, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీ) 259, పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు 410 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా కేజీబీవీలో బోధన ఉద్యోగులు 410, బోధనేతర సిబ్బంది 488, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో బోధన సిబ్బంది 36, బోధనేతర ఉద్యోగులు, రూ. 5, 500 నుంచి గరిష్ఠంగా రూ. 25 వేల వరకు నెల వేతనం పొందుతున్నారు. ఇతర సదుపాయాలేమీ వీరికి వర్తించవు. వచ్చే జీతంలో నుంచే బస్సు చార్జీలు, స్టేషనరీ భరించాల్సి ఉంటుంది. వీరిలో కేవలం నల్లగొండ జిల్లాలోనే ఆయా విభాగాల్లో 1,163 మంది ఉండగా మిగిలిన వారు సూర్యాపేట, యాదాద్రిలో ఉన్నారు.
వేతనాలను వెంటనే చెల్లించాలి
రెండు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటున్నప్పటికీ వేతనాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. రెండు నెలలుగా కుటుంబ పోషణ భారంగా మారింది. ఇప్పటికైనా నూతన ప్రభుత్వ స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ వేరకు మా సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి. అందరు ఉద్యోగులతో సమానంగా ఒకటో తేదీలోపు వేతనాలు ఇవ్వాలి.
– తిరందాసు సంతోష్‌కుమార్, సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం
ఒడిశా, మహారాష్ట్ర, హర్యానాలో మాలాంటి ఉద్యోగులను అక్కడి ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. నెరవేర్చి న్యాయం చేయాలి. గతంలో ఉద్యోగ భద్రతకు ధర్నాలు చేస్తే ప్రస్తుతం వేతనాల కోసం ఆందోళన బాట పట్టాల్సి వస్తుండడం బాధాకరం. సమగ్రశిక్షా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడంలేదు.
– బృహిణి – సీఆర్పీ, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా