ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిరాదరణకు గురైన రజకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారి కులవృత్తిని ఆధునీకరిస్తూ ఉపాధి, ఆదాయం పొందేలా కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని విధాలా ఆదుకుంటున్నది. ఇప్పటికే రజకులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను ఇస్తున్నది. ఇవే కాకుండా మున్సిపాలిటీల్లో మోడ్రన్ ధోబీఘాట్లను నిర్మిస్తున్నది. ఇప్పటికే నల్లగొండలో ఆధునిక ధోబీఘాట్ ప్రారంభం కాగా ఆలేరులో పనులు నడుస్తున్నాయి. తాజాగా ఉమ్మడి జిల్లాకు మరో 19 ధోబీఘాట్లను రాష్ట్ర సర్కారు మంజూరు చేసింది. ఒక్కో ఘాట్ నిర్మాణానికి రూ. 2 కోట్లు కేటాయించింది. ఫలితంగా వందల మంది రజకులకు ఉపాధి కలుగనున్నది. ధోబీఘాట్ల మంజూరుపై రజక సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ కొండూరు సత్యనారాయణ అధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
– యాదాద్రి భువనగిరి, మార్చి 5 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా 142 మున్సి పాలిటీల్లో ధోబీఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 19 మంజూరు కాగా యాదాద్రి జిల్లాలో భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీలకు, నల్లగొండ జిల్లాలో చండూరు, నందికొండ, చిట్యాల, హాలియా, నకిరేకల్, దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోనేరేడుచర్ల, తిరుమలగిరి, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీలకు ధోబీఘాట్ల మంజూరయ్యాయి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఒక్కో ధోబీఘాట్ నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. అయితే ధోబీఘాట్ల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాల్సి ఉంది. భువనగిరిలో ఇప్పటికే ఉన్న ధోబీఘాట్ స్థానంలో మోడర్న్ లాండ్రీ కట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆలేరు మున్సిపాలిటీకి ఆధునిక ధోబీఘాట్ మంజూరైంది. ఇక్కడ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో మోడ్రన్ లాండ్రీలు అందుబాటులోకి రానున్నాయి.
మోడ్రన్ లాండ్రీలు ఇలా..
రజక వృత్తి ఆధునిక సొబగులు దిద్దుకోనుంది. మోడ్రల్ లాండ్రీలు అందుబాటులోకి వస్తే వృత్తి పని మరింత సులువు కానుంది. ఒక్కొక్కటి 60కిలోల సామర్థ్యం ఉన్న 2 వాషర్లు, 30 కిలోల సామర్థ్యం ఉన్న రెండు హైడ్రో ఎక్స్‌ట్రాక్టర్లు, 30 కిలోల కెపాసిటీ ఉన్న రెండు డ్రయ్యర్లు, నాలుగు మాన్వల్ ఐరన్ టేబుళ్లు ఉండనున్నాయి. భవనంపై రేకుల షెడ్డులు, దుస్తులు ఆరేసేందుకు వీలుగా స్టీల్ పైపులు, విద్యుత్ ఉపకరణాలు తదితర వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఘాట్ల నిర్మాణంతోపాటు రజక వ్రుత్తిదారులకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. మెషిన్ల ద్వారా పది మంది పది రోజుల్లో చేసే పనిని గంటల్లోనే చేస్తాయి. ధోబీఘాట్ల నిర్వహణ బాధ్యతలను రజక సొసైటీలకు అప్పగిస్తారు. ఒక్కో షిఫ్టులో 200మందికి చొప్పున రెండు షిఫ్టుల్లో 400 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఖర్చులన్నీ పోగా ఒక్కో రజక సంఘానికి నెలకు రూ. 30వేల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
250 యూనిట్ల ఉచిత విద్యుత్..
రాష్ట్ర ప్రభుత్వం రజకులతోపాటు నాయీ బ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాండ్రీలకు 250 యూనిట్లకు వరకు ఫ్రీ గా ఇస్తున్నది. రజక వృత్తిదారులు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 3,420 మంది రజకులు ఉచితంగా విద్యుత్‌ను పొందుతున్నారు. తద్వారా వృత్తి పనిచేసుకొంటూ ఆదాయాన్ని గడిస్తున్నారు.
రజకుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం..
ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్న రజకుల ఆర్థికాభివృద్ధికి దేశానికే రోల్ మోడల్ గా ఆధునిక ధోబీఘాట్లను మంజూరు చేయడం చరిత్రలో లిఖించదగింది. ఒక్కో మున్సిపాలిటీకి 2 కోట్లు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. రజకులు అనారోగ్యం పాలవకుండా.. కూలీలుగా మారకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం.
– కొండూరు సత్యనారాయణ, రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్