Insurance | నల్లగొండ, మే 5 : నిత్యం ముప్పూటలా తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి పొట్ట పోసుకునే గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం.. గీత కార్మికులకు రైతు బీమా తరహాలో ఇన్సూరెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. తాటి చెట్టు పైనుంచి జారిపడి చనిపోతే వచ్చే ఎక్స్‌గ్రేషియా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణమే పరిహారం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి త్వరలో విధివిధానాలు రానున్నాయి. ఇప్పటికే శిస్తు రద్దుతోపాటు 50 ఏండ్లు నిండిన వృత్తిదారులకు రూ.2016 పింఛన్ ఇస్తున్నది. ఎక్స్‌గ్రేషియాను రూ.ఐదు లక్షలకు పెంచిన ప్రభుత్వం.. గీత కార్మికులందరికీ మోపెడ్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్న గీత కార్మికులు జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రైతు బీమా తరహాలో ఎక్స్‌గ్రేషియా..
గీత కార్మికులు కల్లు గీయడానికి నిత్యం మూడు సార్లు చెట్టు పైకి ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారి పడి ప్రమాదానికి గురైతే ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి కుటుంబాలను ఆదుకునేందుకే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నది. గతంలో రూ.2లక్షలు ఉన్న ఎక్స్‌గ్రేషియాను బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5లక్షలకు పెంచింది. ఈ ఎక్స్‌గ్రేషియా బడ్జెట్ విడుదలైనప్పుడే ఎక్సైజ్ శాఖ ద్వారా అందిస్తుండడంతో బాధిత కుటుంబానికి పరిహారం ఆలస్యమై ఇబ్బంది పడుతున్నది. ఈ నేపథ్యంలో ఎక్స్‌గ్రేషియా వెంటనే అందించాలనే ఉద్దేశంతో రైతు బీమా తరహాలో గీత కార్మికుడు చనిపోయిన వారం పది రోజుల్లోనే పరిహారం అందించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది.
ఆర్థిక, సంక్షేమ ఫలాల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు
గీత కార్మికులకు, గౌడ సామాజిక వర్గాలకు ఆర్థిక, సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి మన జిల్లా వాసి పల్లె రవికుమార్ గౌడ్‌ను నియమించింది. ఈ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది నుంచి ప్రతి కార్మికుడికి ఆర్థిక, సంక్షేమ ఫలాలు అందేవిదంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రైతు బీమా తరహాలో కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని ఎక్సైజ్ శాఖ సమన్వయంతో ఈ కార్పొరేషన్ అందించనున్నది. అదేవిధంగా లైసెన్స్ ఉండి కల్లు గీసే ప్రతి కార్మికుడికీ పది శాతం వ్యక్తిగత కాంట్రిబ్యూషన్తో మోపెడ్ అందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే రూపొందించారు.
పెరిగిన పింఛన్.. మద్యం
దుకాణాల్లో రిజర్వేషన్లు
50 ఏండ్లు నిండిన గీత కార్మికులందరికీ ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.2016 అందిస్తున్నది. దీంతో జిల్లాలో 50 ఏండ్లు నిండిన 7,162 మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని గౌడ కులస్తులు ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో 15శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో జిల్లాలో 24 మద్యం దుకాణాలు గౌడ సామాజిక వర్గానికి కేటాయించబడ్డాయి. అక్కడ పోటీ తక్కువగా ఉండడంతో తక్కువ ధరకే వాటిని దక్కించుకున్నారు.
జిల్లాలో 30వేల మంది గీతన్నలకు సంక్షేమ ఫలాలు
ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో జిల్లాలో 30,272 మంది కల్లుగీత వృత్తిదారులు లబ్ధి పొందుతున్నారు. 2017-18లో తాటి చెట్ల పన్ను రద్దు చేయడంతో ఏటా రూ.69.72 లక్షల ప్రయోజనం కలుగుతున్నది. జిల్లాలో 2014 నుంచి ఇప్పటి వరకు 89 మంది తాటి చెట్టు పైనుంచి పడి మృతిచెందగా.. 153 మంది శాశ్వత అంగవైకల్యం పొందారు. 192 మంది పాక్షిక అంగవైకల్యం పొందారు. శాశ్వత అంగవైకల్యం పొందిన, మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది. తాత్కాలిక అంగవైకల్యం పొందిన వారికి రూ.10వేల చొప్పున అందించింది. మొత్తంగా జిల్లాలో 434 మందికి ప్రభుత్వం నుంచి రూ.4.65 కోట్ల పరిహారం అందింది.
బీమాపై గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది
చెట్టు పైనుంచి పడి చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా ప్రస్తుతం ప్రభుత్వం రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది. ఈ పరిహారం ఆలస్యం అవుతున్నందున బాధిత కుటుంబానికి తక్షణమే అందాలనే ఉద్దేశంతో రైతు బీమా తరహాలో ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది. ఇందుకుగాను ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుంది. అయితే.. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ మాత్రం రాలేదు. రూపకల్పనలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎక్స్‌గ్రేషియా ఐదు లక్షలు వస్తున్నందున అంతే స్థాయిలో ఇస్తారని తెలుస్తుంది.
– సంతోష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, నల్లగొండ
జిల్లాలో గీత వృత్తిదారులకు సర్కారు అందించిన సాయమిది..
చెట్టు పన్ను రద్దు ప్రయోజనం పొందినవారు : 30,272 మంది
ఏటా పన్ను రద్దు : రూ.69.72 లక్షలు
మద్యం దుకాణాల కేటాయింపు : 24 షాపులు
ఎనిమిదేండ్లలో చెట్టు పైనుంచి పడి మరణించిన లేదా శాశ్వత, పాక్షిక అంగవైకల్యం పొందినవారు : 434 మంది
ప్రభుత్వం అందజేసిన ఎక్స్‌గ్రేషియా : రూ.4.45కోట్లు
ఆసరా పింఛన్లు పొందేవారు :7,162 మంది